President Droupadi Murmu : మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె నివాళులర్పించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ చరిత్ర, ప్రగతిని వివరించారు.
‘‘భిన్నత్వంలో ఏకత్వం మన బలం. సమ్మిళిత వృద్ధి ద్వారానే దేశం ముందుకు సాగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోవడం యువతలో స్ఫూర్తి నింపుతోంది. వికసిత్ భారత్‌లో మహిళల పాత్ర కీలకం. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోంది. వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, స్వయం ఉపాధి నుంచి రక్షణ రంగం వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. లింగ సమానత్వం ఆధారంగా నిర్మితమయ్యే సమ్మిళిత గణతంత్రానికి భారత్ ఒక ఉదాహరణ. ఇటీవల బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా జరుపుకొన్నాం. పేద ప్రజలకు 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మించాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల సంఖ్య పెరిగింది. బడుగు, బలహీనవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం. రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే మూలస్తంభాలు. పంటలకు మద్దతుధర, విత్తనాలు, బీమా కల్పిస్తూ.. పీఎం గరీబ్ కల్యాణ్ కింద అనేక పథకాలు చేపట్టాం.
రాజ్యాంగం అమలులోకి రావడంతోనే భారత్ నిజమైన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ప్రజాస్వామ్యాన్ని ఓటర్లే పరిరక్షిస్తారని అంబేడ్కర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద గణతంత్ర రాజ్యానికి మన రాజ్యాంగమే పునాది. మన రాజ్యాంగంలో పొందుపర్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటివి మన దేశానికి ప్రాణవాయువులు. దేశ యువత విదేశాల్లోనూ మంచిపేరు తెచ్చుకుంటున్నారు. మన యువత స్టార్టప్‌లు నెలకొల్పి సత్తా చాటుతున్నారు. ‘వందేమాతరం’ గీతం మన దేశానికి ఒక లయబద్ధమైన జాతీయ ప్రార్థన.