న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, పలువురిని బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకొన్నారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇందులో ఆరుగురు కొత్తవారు కావటం విశేషం. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేసి, ఆ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లఢక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి.. ఆ స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య తీర్పు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు కీలక తీర్పులను వెలువరించారు. అయోధ్య తీర్పుతో పాటు, త్రిపుల్ తలాక్, రైట్ టు ప్రైవసీ-ప్రాథమిక హక్కు తదితర తీర్పులను చెప్పారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించిన ఆయన.. మంగళూరులో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
ఇద్దరికి రాజ్యాంగ పదవులు
అయోధ్య తీర్పు వెలువరించిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కేంద్రం రాజ్యాంగ పదవులు కట్టబెట్టింది. ఇప్పటికే సుప్రీం మాజీ సీజే రంజన్ గొగోయ్‌ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయగా, తాజాగా జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించింది.
ఎన్నికలే లక్ష్యంగా గవర్నర్ల ఎంపిక
పలు రాష్ర్టాల్లో లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు గవర్నర్ల నియామకాన్ని చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి మహారాష్ట్ర అత్యంత కీలకమని, ఎన్నికల సమయంలో కాంట్రవర్సీలు ఉండకుండా ఉండాలంటే తన పని తాను చేసుకొని పోయే గవర్నర్ ఉండాలని భావించిందని వెల్లడిస్తున్నారు. మైనారిటీ, కుల సమీకరణాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ల నియామకాలు చేపట్టిందని పేర్కొంటున్నారు.