న్యూఢిల్లీ, డిసెంబర్ 20: టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన విధానం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘ఎంపీలు తమ గొంతును స్వేచ్ఛగా వినిపించాలి. ఇది హుందాగా, పార్లమెంట్ నిబంధనలకు లోబడి ఉండాలి’ అని తెలిపారు. విపక్ష ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ మంగళవారం ఎంపీలు పార్లమెంట్ మెట్లపై ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ ధన్కర్ను ఉద్దేశించి మిమిక్రీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, తన చివరి శ్వాస వరకు పార్లమెంట్ గొప్పతనాన్ని కాపాడటానికి కృషి చేస్తానని ధన్కర్ వెల్లడించారు. ధన్కర్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంఘీభావం తెలిపారు.
మోదీ వ్యాఖ్యల మాటేంటి?
ప్రతిపక్ష ఎంపీల తీరు బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ ‘సస్పెన్షన్ల నుంచి దృష్టి మరల్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది’ అని పేర్కొన్నారు. గతంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన పోస్టు చేశారు. ఓ సందర్భంలో మోదీ మాట్లాడుతూ అన్సారీ గుర్తింపును ఒక మతానికి పరిమితం చేశారని, మత గుర్తింపు కారణంగానే ఆయన రాజకీయంగా ఎదిగినట్టు వ్యాఖ్యానించారని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీ చర్యపై బెంగాల్ సీఎం మమత మాట్లాడుతూ ‘ఇది ఆందోళనలో భాగంగా జరిగే సాధారణ చర్యే’ అని అన్నారు. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందిస్తూ ఎవరినీ అవమానపర్చాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కేసు నమోదు చేయాలంటూ న్యాయవాది అభిషేక్ గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీల సస్పెన్షన్పై స్పందించరెందుకు?
143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తే ఎవరూ స్పందించరు గానీ.. మిమిక్రీ ఘటనపై విపరీతంగా స్పందిస్తున్నారని మీడియాను ఉద్దేశించి రాహుల్ అన్నారు.