లక్నో, ఏప్రిల్ 21: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరంలో.. సోమవారం సాయంత్రం ఒక కాలనీలో చీకటి పడ్డాక విద్యుత్తు వెలుగుల్లో అందరూ పనులు చేసుకుంటుండగా.. ఆకస్మికంగా కరెంటు పోయింది. సాంకేతిక లోపం ఏర్పడిందేమో.. కొద్దిసేపట్లో కరెంటు వస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. గంట గడిచినా విద్యుత్తును పునరుద్ధరించకపోవడంతో.. కొందరు స్థానిక సొసైటీ యాజమాన్యానికి ఫోన్ చేశారు. అప్పుడు తెలిసింది అసలు సంగతి.. ‘మీ విద్యుత్తు మీటర్‌ను పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మార్చడం జరిగింది.
మీరు గతంలో చెల్లించిన విద్యుత్తు చార్జీలో బ్యాలెన్స్ అయిపోయినందున మీకు సరఫరా నిలిపివేయడమైనది’ అంటూ వారు సమాచారమందించారు. అప్పుడు మొదలైంది కాలనీవాసుల గగ్గోలు.. ‘మాకు తెలియకుండా.. మా సమ్మతి లేకుండా మా మీటర్లను ప్రీపెయిడ్‌గా ఎందుకు మార్చారు?’ అంటూ వారు అధికారులను నిలదీశారు.
ఈ పరిస్థితి కేవలం నోయిడాలోనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో నెలకొన్నది. తమకు తెలియకుండా మీటర్లను ప్రీపెయిడ్‌గా మార్చడమే కాకుండా.. తమకు గతంలో కంటే అధికంగా విద్యుత్తు బిల్లులు వస్తున్నాయంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ విద్యుత్తు యాప్‌లలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ సరఫరా నిలిపివేస్తున్నారని, తరచుగా సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయని నిరసన వ్యక్తంచేస్తున్నారు.
జాలౌన్ గ్రామస్తులు మూకుమ్మడిగా తమ విద్యుత్తు మీటర్లను రోడ్డుపై పడేసి రాస్తారోకో చేపట్టారు. అలీగఢ్‌లో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు ఓ విద్యుత్తు విభాగం అధికారిని తమ గ్రామం నుంచి తరిమికొట్టారని రెండు జాతీయ చానెళ్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ తాజా పరిస్థితిపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని విద్యుత్తు సరఫరా సంస్థ డిస్కమ్‌ను ఆదేశించింది.
విద్యుత్తు సరఫరాను ఆధునీకరించే క్రమంలో భాగంగా యూపీ ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టింది. వాణిజ్య నష్టాలను నివారించేందుకు, ఆదాయాన్ని పెంచుకొనే క్రమంలో భాగంగా ఈ విధానాన్ని అమలుచేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 3.5 కోట్ల మీటర్లను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 78 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చినట్టు తెలుస్తున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ (ఆర్డీఎస్సెస్)’లో భాగంగా బీహార్, గుజరాత్ తదితర రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను వినియోగదారులకు అందజేస్తున్నారు.

వేళాపాళా లేకుండా అధికారులు విద్యుత్తు కోత విధించడంతో యూపీలోని ఒక పెండ్లి వేడుక కాస్తా కలెక్టరేట్‌కు నిరసన ప్రదర్శనగా మారింది. బాండాలో మాటౌంధ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కుల్దీప్ పెండ్లి సందర్భంగా ఆదివారం రాత్రి నృత్య వేడుకలు నిర్వహిస్తుండగా కరెంట్ పోయింది. స్మార్ట్ మీటర్ నెగటివ్ బ్యాలెన్స్ వల్లే కరెంటు సరఫరా ఆగిపోయిందని తెలిసింది. సోమవారం వరుడు ఊరేగింపుగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి నిరసన తెలిపాడు. స్మార్ట్‌మీటర్ల వల్ల రెట్టింపు బిల్లులు వస్తున్నాయని, దానిని సామాన్యులమైన తాము భరించలేక పోతున్నామని తెలిపాడు. తన పెండ్లి బహుమతిగా ఆ బిల్లును అధికారులే చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.