హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా, మౌలిక వసతుల విస్తరణ కోసం ప్రైవేట్ స్థలాలను సేకరించిన జీహెచ్ఎంసీ.. అందుకు బదులుగా ఇవ్వాల్సిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీలో తీవ్ర ఆలస్యం చేస్తున్నది. దీనిపై ఆయా స్థలాల యజమానులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాప్యంతో మారెట్లో టీడీఆర్ బాండ్ల కొరత ఏర్పడి వాటి ధరలు పెరిగిపోతున్నాయని కొండాపూర్‌కు చెందిన ప్రసాద్‌రావు సర్కార్‌పై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల ధరలు 30 శాతంగా ఉంటే, ఇప్పుడు 65 శాతానికిపైగా పెరుగడంతో కొనుగోలుదారులపై మోయలేని భారం పడుతున్నదని, ఫలితంగా ఇప్పటికే మందగించిన రియల్ ఎస్టేట్ మరింత కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాండ్ల కోసం వేచిచూస్తున్న యజమానులు నిధులు అందక ఇబ్బందులు ఎదురొంటున్నారని వివరించారు. బాండ్ల లభ్యత తగ్గడంతో దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.