న్యూఢిల్లీ, జూలై 27 : రిటైల్, బల్క్ కస్టమర్ల కోసం తపాలా శాఖ.. 24 స్పీడ్ పోస్ట్, 48 స్పీడ్ పోస్ట్ సేవల ధరలను తాజాగా ప్రకటించింది. అలాగే తొలిసారి డాక్యుమెంట్, పార్సిళ్లను వర్గీకరించింది. ఇందులో భాగంగానే లేఖలతోపాటు రీ-సేల్ విలువలేని ప్రింటెడ్, కాంప్లిమెంటరీ ఐటమ్స్ ఏవైనాసరే వాటిని డాక్యుమెంట్స్‌గా నిర్వచించింది. వీటి షిప్పింగ్ రేట్లు తక్కువగా ఉంటాయని కూడా స్పష్టం చేసింది. ఇక మిగతావన్నీ పార్సిల్ కేటగిరీలోకే వస్తాయని పేర్కొన్నది.
కచ్చితంగా 24 స్పీడ్ పోస్ట్.. 24 గంటల్లోనే డెలివరీ అవుతుందని, అలాగే 48 స్పీడ్ పోస్ట్.. 48 గంటల్లోపే కస్టమర్లకు అందుతుందని తపాలా శాఖ ఓ నోటిఫికేషన్లో తెలిపింది. ఇక వెల్కమ్ కిట్లు లేదా లెటర్స్, పాస్ పుస్తకాలు, చెక్ బుక్కులు, బ్యాంక్ స్టేట్మెంట్లు, డెబిట్-క్రెడిట్ కార్డులు, పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇతర ప్లాస్టిక్ కార్డుల వంటి బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలకు చెందినవన్నీ కూడా డాక్యుమెంట్స్గానే పరిగణిస్తారు. వ్యాపార-వాణిజ్య ఉత్పత్తులు మినహా రాఖీ కవర్లు, గ్రీటింగ్ కార్డులు, ప్యాకేజీలు 500 గ్రాములదాకా ఉంటే వాటినీ డాక్యుమెంట్స్గానే చూస్తారు. కాగా, రిటైల్ కస్టమర్ల కోసం సర్వీస్ రేట్లలో ఎలాంటి మార్పూ లేదు. అయితే లెటర్ కేటగిరీలో బల్క్ కస్టమర్లకు మాత్రం అదనపు రేట్లను తపాలా శాఖ ప్రకటించింది. అలాగే అందరికీ చార్జీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనం. వచ్చే నెల 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.