ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలవంతుడే గాని సమర్థుడు, నిజాయితీపరుడు కాదు. బలవంతుడంటే ఏమిటి, తనకు ఆ లక్షణాలు ఏమి ఉన్నాయి? సమర్థత, నిజాయితీ అంటే ఏమిటి, ఆయనలో అవి ఏ విధంగా కనిపిస్తున్నవి, లేదా కనిపించటం లేదు? అన్నవి ప్రశ్నలు. కాకతాళీయమైన రీతిలో తనలోని బలం, అసమర్థత, నిజాయితీ లేనితనం, కూడా ఏకకాలంలో ప్రస్తుత కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన సందర్భంగా యువతరానికి, దేశ ప్రజలకే గాక, యావత్ ప్రపంచానికి తెలియవస్తున్నది. ఇది 12 సంవత్సరాల పాలన తర్వాత, తమ అధికారాన్ని ఇక నిరవధికం చేసుకోగలమని కలలు కంటున్నవేళ జరగటం ఒక అసాధారణ పరిణామం.
ఒక పాలకునికి ఉండవలసిన లక్షణాలు ప్రధానంగా మూడు. ఒకటి: బలం, రెండు: పరిపాలనా సమర్థత, మూడు: తన ప్రజలతో నిజాయితీ. ఈ మూడింటికి మూడు ఉండాలి. ఏ ఒక్కటి ఉండి తక్కిన రెండు లేకు న్నా, ఏ రెండు ఉండి మూడవది లేకుండా అతను సరైన పాలకుడు కాలేడు. మోదీ బలం మాట కొద్దిసేపు వాయిదా వేసి, ఆయన సమర్థత, నిజాయితీ కాక్రోచ్ ఆందోళన సందర్భంగా ఏ విధం గా ప్రదర్శితమవుతున్నాయో చూద్దాము.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావటాన్ని పురస్కరించుకుని ఈ ఆందోళన సాగుతున్నది. మోదీ సమర్థుడైన పాలకుడు అవుతే అసలు అటువంటి లీకేజీలు ఉండని వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లోగడ కాంగ్రెస్ హయాంలో, ప్రతిపక్ష రాష్ర్టాల్లో ఇప్పటికీ జరగటంలేదా అని ప్రశ్నిస్తున్నారు. అవును, జరిగిన మాట నిజం. ఆ విషయాన్ని గుర్తించినపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేయవలసిందేమిటి? అక్కడి వైఫల్యాలను గుర్తించి అటువంటివి తమ ఏలుబడిలో జరగకుండా చూడటం. అది సమర్థత అవుతుంది. అంతే తప్ప ఇతర ప్రభుత్వాల వైఫల్యాలను సాకుగా చూపి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోజూడటం సమర్థత కాదు. ఆ పనిచేస్తున్న మోదీ సమర్థుడు ఎట్లా అవుతారు? దేశానికి సమర్థవంతమైన పాలనను ఇచ్చిన వారెట్లా కాగలరు? అపుడది జవాబుదారీతనం ఎట్లవుతుంది? యువతరం సమస్యలను వ్యవస్థలోని లోపాలతో, అభివృద్ధి లోపాలతో కలిపి చూసి పరిష్కరించ చూడటం ఎట్లవుతుంది?
ఇది ఒకటి కాగా, మోదీ 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి 152 ప్రశ్నాపత్రాలు లీకయినాయనే లెక్క ముందుకు వచ్చింది. ఈ లెక్క ఎవరు వేశారో తెలియదు గాని, ఆ మాటను ప్రభుత్వం ఖండించటం లేదు. దానిని బట్టి అది నిజమనుకోవాలి. ఒకటి కాదు, పది కాదు 152 అంటే..మామూలు విషయం కాదు. ఇటువంటి లీకేజీలు అడ్డు అదుపు లేకుండా జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు? నిజానికి ఇది యావత్తూ విచారణ జరగవలసిన విషయం. అది జరిగినపుడు మోదీ సమర్థత ఏమిటో దేశానికి ఇంకా బాగా తెలియవస్తుంది. లీక్ అయిన ప్రశ్నాపత్రాలు ఏవేవి? అందుకు జరిగిన విచారణలు, కనుగొన్న కారణాలు ఏవి? నేరస్తులపై తీసుకున్న చర్యలేమిటి? అటువంటి లోపాలు తిరిగి చోటుచేసుకోకుండా ఏ చర్యలు తీసుకున్నారు? అవి ఇచ్చిన ఫలితాలేమిటి? అయినా లీకులు ఎందుకు ఆగలేదు? ఆ సంఖ్య 152కు ఎట్లా పెరిగింది? అధికారులు, విద్యామంత్రులు, ప్రధానమంత్రి వహించిన బాధ్యత ఏమిటి? దేశానికి ఈ వివరాలేవీ తెలియవు. ఇవన్నీ వెల్లడైనపుడు గాని మోదీ సమర్థత ఏమిటో బోధపడదు.
ప్రస్తుతానికి కనిపిస్తున్నది మాత్రం ఎప్పుడు ఏ చర్యలూ లేవు. కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ పలుమార్లు అన్నా జరగలేదు. నీట్ పేపర్ లీకేజీ సందర్భంగా కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఆ చర్యలనేవి కేవలం బదిలీలు, కింది స్థాయి వారికి శిక్షలు తప్ప, ఈ లీకేజీ ఎంత తీవ్రమైనదో అందుకు పోల్చగలది కాదు. తీవ్రతకు మసిబూసి ప్రజలను మభ్యపెట్టేందుకు బదిలీలు ఒక ఎత్తుగడ మాత్రమేనన్నది తెలిసిన విషయమే. అనగా అదేవిధమైన ఎత్తుగడల సమర్థతను మోదీ ప్రదర్శించారన్న మాట.
ఆయన సమర్థత ఎటువంటిదో ఇంకా చూద్దాము. ప్రస్తుత సమస్య ఆందోళనరూపం తీసుకోవటం, గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థులను, యువతీయువకులను, వారి తల్లిదండ్రులను, తక్కిన సమాజాన్ని, ఢిల్లీలోనే గాక దేశవ్యాప్తంగా కదిలించటం, ప్రపంచమంతటా వార్తలకెక్కటం కొన్ని వారాలుగా జరుగుతున్నది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల కొంతకాలంగా మసలుతున్న అసంతృప్తి ఇపుడు పైకి ఎగజిమ్ముతున్నది తప్ప ఇది కేవలం నీట్‌కు పరిమితమైంది కాదు. అటువంటి స్థితిలో సమర్థుడైన పాలకుడు చేయవలసిందేమిటి? సమస్యకు పరిష్కారాన్ని కనుగొనటమా, లేక నిరసనకారులను అణచివేయటమా? మహా సమర్థుడని ప్రచారాలు జరిగే మోదీ రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు.
తన సమర్థతనంతా ఉపయోగించి అణచివేతలు సాగిస్తున్నారు. అణచివేత చర్యల పాశవికతను చూసి మొత్తం దేశం, ప్రపంచమే నిర్ఘాంతపోతున్నాయి. చివరకు మహిళలు, టీనేజ్ బాలబాలికలను, వృద్ధులను సైతం మోదీ ప్రభుత్వపు సమర్థవంతమైన అణచివేతలు వదలలేదు. తీవ్రమైన లాఠీఛార్జీల నుంచి మొదలుకొని, షాక్‌లు ఇచ్చేలా లాఠీలు, మేకులు కొట్టిన లాఠీలు, అంతర్జాతీయంగా నిషేధించిన పెల్లెట్ గన్ల ఉపయోగం, ప్రైవేటు గూండాలు, చట్టప్రకారం ధరించవలసిన నేమ్ప్లేట్లు తీసేసిన పోలీసులు, అల్లర్లు జరిగినపుడు మాత్రమే మోహరించవలసిన ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్, జంతర్‌మంతర్ వెనుక వీధిలో అర్ధరాత్రి తెచ్చిపెట్టిన రాళ్లు, ఇటుకల ట్రక్కులు.
ఇదీ అణచివేత సామర్థ్యం. అంతటితో ఆగిందా? లేదు. మధ్య మధ్య మంచినీళ్లు, ఆహార సరఫరాలను, టాయిలెట్లలో నీళ్లు, విద్యుత్తును నిలిపివేయటం కూడా. ఒకరోజైతే, మీకు ఈ మంచినీళ్లు, ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పమని పోలీసులు ఉద్యమకారులను నిలదీయటం కనిపించింది. సమస్య పరిష్కారానికి ఎంత సమర్థవంతమైన పాలన ఇది? అసలు తమ ఆర్థిక వైఫల్యాలే పరిస్థితి ఈ దశకు తెచ్చాయని మోదీకి అర్థమైనా అయిందా?
సమర్థవంతుల పాలనలో శోడష కళలన్నవి అణచివేతకు కూడా ఉంటాయి. వాటిలో ఒకటి దుష్ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు, అసంబద్ధమైన ఆరోపణలు. ఈ పనిలో బీజెపీకి, దాని అనుబంధ సంస్థలకు మొత్తం దేశంలోనే మరే పార్టీకి, సంస్థకు లేని ఆరితేరిన సామర్థ్యం ఉండటాన్ని ఎప్పటినుంచో చూస్తున్నాము. అదే ప్రకారం ఈ సందర్భంలోనూ వెంటనే ప్రచార యంత్రాంగం రంగంలోకి దిగింది. నిరసన చేసే విద్యార్థులను టెర్రరిస్టులని మొదటనే అన్నారు. ఆ వెంటనే పాకిస్థాన్ ఏజెంట్లని, హిందూ వ్యతిరేకులని, వారితో అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు, ఖలిస్థానీలు, సంఘ విద్రోహశక్తులు చేరారని, అభిజిత్ దిప్కే అమెరికాలో చదివి వచ్చాడు గనుక అమెరికన్ హస్తం ఉందని, రహస్య నిధులు వస్తున్నాయని ప్రచారాలు సాగించారు. లోగడ రైతు ఉద్యమంతోపాటు పలు ఇతర ఉద్యమాల విషయంలోనూ ఇదే తరహా ప్రచార సమర్థతలు చూపటం తెలిసిందే. ప్రచారం విజయవంతమైతే సగం యుద్ధం గెలిచినట్లే అంటారు నిపుణులు. శత్రురాజ్యంలో ఈ విధంగా పుకార్లు వ్యాపింప చేయాలని క్రీస్తుపూర్వం చాణక్యుడు కూడా సలహా ఇచ్చాడు.
వాస్తవానికి బీజేపీకి ఈ వ్యూహం బాగానే పనిచేస్తూ వచ్చింది కూడా. కాని వారి దురదృష్టవశాత్తు, రైతు ఉద్యమ దశలోనే తేలిపోవటం మొదలైన ఈ కుత్సిత వ్యూహం, ఇపుడు కాక్రోచ్ ఉద్యమ సమయంలో జోరుగాలికి దూదపింజవలె కొట్టుకుపోయింది. ఈ ప్రభావాలు దేశ యువతపై, సమాజంపై పడుతుండటం, వారు వాస్తవాలు గ్రహిస్తుండటం సంతోషించవలసిన విషయం. తమను విమర్శించే వారిపై ఈ తరహా ప్రచార సామర్థ్యాన్ని చూపడటం గతంలో వలె చెల్లుబాటు కాదని అధికారపక్షం గ్రహించటం మంచిది.
నీట్ సమస్య, విద్యార్థి యువజనలోకంతోపా టు సమాజపు ఆందోళన ఇంత స్పష్టంగా కనిపిస్తున్నపుడు కూడా ఇంత అవివేకపు ప్రచార వ్యూహా న్ని అనుసరించటమే వారి అసమర్థతను ఎత్తిచూపుతున్నది. విచారకరమేమంటే, ప్రభుత్వం దిగివ చ్చి ఆందోళన ముగిసినాక కూడా తెలంగాణ బీజే పీ నేతలు అదే మురికి ప్రచారం సాగిస్తున్నారు. మోదీ నిజాయితీ విషయానికి వస్తే, అది ఈ విధమైన సమర్థతా నాణేనికి బొరుసు వంటిది. అసమర్థత, నిజాయితీ రాహిత్యం ఒకదానివెంట ఒకటిగా సాగుతాయి. ఆయన పాలనలో ఇతరత్రా కనిపిస్తూ వచ్చిన నిజాయితీ లేనితనాన్ని అట్లుంచి ప్రస్తుత సందర్భానికి పరిమితమవుదాం. నిజాయితీ గల పాలకునికి ధైర్యం కూడా ఉంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినపుడు వైఫల్యాన్ని వెంటనే నిజాయితీతో అంగీకరిస్తాడు.
జరపవలసిన విచారణలు సత్వరమే జరిపి స్వపరభేదం లేకుండా చర్యలు తీసుకుంటాడు. ఈ పనులు కనిపించిపుడు బాధితులకు, ప్రజలకు పాలకుల పట్ల విశ్వాసం కలుగుతుంది. పరిస్థితి నిరసనలు, ఆందోళనలకు దారితీయవు. కాని ఇటువంటివేవీ చేసే నిజాయితీ ప్రధాని మోదీకి లేకపోయింది. ఆ స్థానాన్ని, మహా బలవంతుడగు నాయకుడైన తనను ఎవరూ అడగలేరు, నిలదీయలేరనే అహంకారం ఆక్రమించింది. ఆందోళనకారులను అణచివేసేందుకు తనకు అడ్డులేదనే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల, అసలు స్పందించనైనా స్పందించకుండా వదలివేశారు. అంతటితోనైనా ఊరుకోక యథావిధిగా తన పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం యంత్రాంగం ద్వారా విద్యార్థులపైన విషప్రచారాలు నడిపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, విశ్వానికే గురువునని ప్రచారాలు చేయించుకునే ఒక దేశ ప్రధాని చూపవలసిన నిజాయితీ, వ్యవహరించవలసిన తీరు ఇదేనా?
ఇక, మోదీ బలవంతుడవటం అంటే ఏమిటి? ఆ మాటకు వస్తే ఏ పాలకుడు అయినా? ఒకటి: ప్రజాస్వామిక మార్గంలో కావటం. రెండు: అప్రజాస్వామికంగా కావటం. ప్రజాస్వామికతకు గీటురాయి ఎన్నికల్లో గెలవటం ఒక్కటే కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ నిపుణులు అంటున్నమాట. ఎన్నికల్లో గెలవటం వక్రమార్గాల్లో జరిగే ధోరణి పెరుగుతున్నది గనుక. నరేంద్ర మోదీ పార్టీ అనుసరిస్తున్న మార్గాలు ఏమిటి? ఎన్నికల సమయంలోగాని, ఆ తర్వాత గాని బీజేపీ, మోదీ బలవంతులయేందుకు ఏమేమి చేస్తున్నదీ దేశం చూడటం లేదా? ఆ పార్టీకి అసలు పునాది లేదని కాదు.
కాని అంతకుమించిన బలం రకరకాల విషప్రచారాలతో, దేశభక్తి పేరిట రెచ్చగొట్టి లాభపడటంతో, హిందూ-ముస్లిం వాదనల్లో సమాజాన్ని పలు విధాలుగా చీల్చటంలో, ఎన్నికల కమిషన్‌ను, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరచటంలో, విచ్చలవిడిగా ధన వినియోగంతో, ‘సర్’ పేరిట ఓటర్ జాబితాల తారుమారులో, ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టటంలో, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పటంలో సంపాదిస్తున్న బలం అనేక రెట్లు ఉంది. అనగా అధిక భాగం నకిలీ బలమన్నమాట. బలవంతుడనుకున్నా, సమర్థత, నిజాయితీ లేనితనం ఎవరి కోసం? అందువల్ల, ఒక మంచి పాలకునికి ఉండవలసిన సవ్యమైన బలం, పరిపాలనా సమర్థత, నిజాయితీ ఏవీ కూడా నరేంద్ర మోదీకి లేవు. ఇటువంటి నాయకుడు, ఆయన పార్టీ ఇపుడు తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ఖాయంగా తెస్తామని, తమకు పక్కా ప్రణాళికలు ఉన్నాయని ఢంకా బజాయిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.
– టంకశాల అశోక్