రాంచీ : జార్ఖండ్ అక్రమ మైనింగ్ కేసులో ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈడీ సీఎం హేమంత్ సోరెన్ ప్రతినిధి అయిన పంజక్ మిశ్రాను విచారించిన అనంతరం.. జార్ఖండ్, బిహార్‌లో 17 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రేమ్ ప్రకాశ్‌కు పలువురు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. అంతకు ముందు సోరెన్‌కు అత్యంత సన్నిహితులైన మరో ఇద్దరిని అరెస్టు చేసింది. విచారణలో ఇద్దరు తెలిపిన వివరాల ఆధారంగానే ఈడీ దాడులు నిర్వహించింది. ఈ ఏడాది జూలై 8న ఈడీ మిశ్రా, అతని సహచరులకు చెందిన 19 చోట్ల దాడులు జరిపింది.
అక్రమ మైనింగ్ వ్యవహారంలో జూలైలో జరిపిన దాడులలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 50 బ్యాంకు ఖాతాల్లోని రూ.13.32 కోట్ల నిధులను సీజ్ చేసింది. జార్ఖండ్‌లో జరిగిన రూ.100 కోట్ల అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై విచారణ జరుపుతున్నట్లు ఈడీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మరో వైపు ప్రేమ్ ప్రకాశ్ ఇంటి నుంచి నిన్న అర్ధరాత్రి రెండు ఏకే47లు, 60 కాట్రిడ్జ్‌లను, రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నది. అయితే, తర్వాత రాంచీ పోలీసులు ప్రకటన విడుదలచేస్తూ.. రెండు ఏకే 47లు ప్రేమ్ ప్రకాశ్వి కాదని, రాత్రి అతనితో బస చేసిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లవని పేర్కొంది. ఆ ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.