హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్‌శాఖలో పదోన్నతుల వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా మారగా, కొత్తగా వసూళ్ల దందా వెలుగులోకి వచ్చింది. అనర్హులు, కేసులున్న వారికి పదోన్నతులు కట్టబెట్టిన వ్యవహారం మరువకముందే వసూళ్ల పర్వం బహిర్గతమయ్యింది. ప్రమోషన్ల పేరిట పెద్దఎత్తున వసూళ్ల దందాకు తెరలేపినట్టు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో అధికారి వద్ద లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారంలో కోటిన్నరకు పైగా చేతులు మారినట్టు వినిపిస్తున్నది.
50 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీవోలు), జిల్లా పంచాయతీ అధికారులను(డీపీవోలు) జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా, 24 మంది డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ప్రమోషన్ కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరిపై ఉన్న పెండింగ్ కేసులను డిఫర్ చేసి ప్రమోషన్లకు లైన్ క్లియర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని వసూళ్లకు తెరలేపినట్టు ఆ శాఖలో ప్రచారం జరుగుతున్నది. ఆరోపణలున్న వారి నుంచి పెద్దమొత్తంలో, మరికొందరి నుంచి ప్రమోషన్ల పేరిట కొంత మొత్తం వసూలు చేసినట్టు ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
ఈ వసూళ్ల పర్వం అత్యంత రహస్యంగా, మధ్యవర్తుల ద్వారా సాగుతున్నట్టు సమాచారం. ఇందులో కీలకనేత హస్తమున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓ మధ్యవర్తి వసూళ్లకు పాల్పడ్డట్టు ఆ శాఖలోని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. శాఖలోని కొందరు కిందిస్థాయి సిబ్బందితోపాటు కొంతమంది కీలక వ్యక్తులు ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఇద్దరు, ముగ్గురు కీలకవ్యక్తుల నేతృత్వంలో జరిగినట్టు సమాచారం. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఎలా పంచుకుంటారు? ఎవరికీ పంచుతారు? అనే కీలక అంశాలపై కొందరు అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.