Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నారు. ఒక ఓటు బీహార్ (Bihar) లో ఉండగా.. మరో ఓటు పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఉంది. ఎన్నికల అధికారులు (Election officials) మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను చిక్కుల్లో పడేసింది.
ప్రశాంత్ కిషోర్ కోల్‌కతాలోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారు. అది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి సొంత నియోజకవర్గం. నియోజవర్గంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆయన అడ్రస్‌గా పేర్కొన్నారు. బీ రాణీశంకరీ రోడ్‌లోని సెయింట్ హెలెన్ పోలింగ్ స్టేషన్లో ఆయనకు ఓటు ఉందని అధికారులు తెలిపారు.
2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేశారు. అప్పుడే ఆయన ఓటరుగా నమోదయ్యారు. ఇక బీహార్‌లోని ససారామ్ నియోజకవర్గంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఓటరుగా ఉన్నారు. కోనార్లోని మధ్య విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఆయనకు ఓటు ఉందని అధికారులు వెల్లడించారు.
రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950లోని సెక్షన్ 17 ప్రకారం.. ఏ వ్యక్తికి కూడా దేశంలోని ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదని ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉండటం ఆయనను చిక్కుల్లో పడేసింది. సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు ఇది రాజకీయంగా కొంత నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.