Prashant Kishor | హైదరాబాద్, ఆగస్టు 26 (స్పెషల్ టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ): బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్‌కు ‘ఓట్ల’ కోసం రేవంత్‌రెడ్డి బీహార్‌లో పర్యటించడంతో ఆ నాటి మాటలపై మళ్లీ మంటలు రగులుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. దీంతో అక్కడి రాజకీయనేతలు రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీహార్ ప్రజలను కించపరిచిన రేవంత్‌ను.. ప్రజలు కర్రలతో తరిమి తరిమి కొడతారు’ అంటూ జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్‌లో ఆయనకు ఏం పని?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు జాతీయ మీడియాతో మంగళవారం మాట్లాడారు.
బీహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరిట ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ చేపట్టింది. అయితే.. ఎస్ఐఆర్లో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొనడానికి సీఎం రేవంత్ మంగళవారం బీహార్‌లో పర్యటించారు. రేవంత్ టూర్‌పై ప్రశాంత్ కిశోర్‌ను మీడియా ప్రశ్నించగా తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి గతంలో బీహార్ ప్రజలను అవమానించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
‘రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్‌లో రేవంత్ రెడ్డికి ఉన్న స్థాయి ఏమిటి? ఆయన బీహార్ కోసం ఏం చేశారు? బీహార్‌ను, బీహార్ ప్రజలను ఆయన దూషించారు. కూలి పని అనేది బీహారీల డీఎన్ఏలోనే ఉందని కించపరిచేలా మాట్లాడారు. రేవంత్‌రెడ్డి బీహార్‌లోని ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు ఆయనను కర్రలతో తరిమి తరిమి కొడతారు. రేవంత్ లాంటి వ్యక్తితో రాహుల్‌గాంధీ వేదికను పంచుకున్నారు. బీహారీలను దూషించిన వ్యక్తిని వేదికపైకి పిలవడంతోనే.. రాహుల్‌గాంధీ మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతున్నది’ అని ప్రశాంత్ కిశోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలు బీహా ర్ ప్రజలను మోసం చేశాయని ధ్వజమెత్తారు.
బీహార్‌లో నిర్వహిస్తున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి రేవంత్ రావడంపై కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత ధర్మేంద్ర ప్రధా న్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీహారీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ను బీహార్‌కు ఎలా ఆహ్వానిస్తారని రాహుల్‌ను నిలదీశారు. రేవంత్‌ను ఆహ్వానించినందుకు రాహుల్, ప్రియాంకగాంధీ.. బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నందుకు ఆర్జేడీనేత తేజస్వీ యాదవ్ కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు.