బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడికి లేఖ రాసిన ఆ పార్టీ నేత, న్యాయవాది జీ దేవరాజె గౌడను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ (36) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన బెంగళూరు నుంచి చిత్రదుర్గ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్కు పంపారు. తన భూమిని అమ్మేందుకు సాయపడతానని చెప్పి, ఆయన తనను వేధించారని, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదుదారు ఆరోపించారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్డీ రేవణ్ణపై బీజేపీ అభ్యర్థిగా దేవరాజె పోటీ చేసి ఓడారు.