చండీగఢ్, జనవరి 31: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్ ప్రభుత్వాలు డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల విద్యుత్తు ఉద్యోగులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మొత్తం 27 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్న ఈ నిరసన శనివారమూ కొనసాగిస్తామని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే వెల్లడించారు.
‘ఏ ప్రాతిపదికన యూ పీలో పూర్వాంచల్, దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్‌లను ప్రైవేటీకరిస్తున్నా రు’ అని ఆయన ప్రశ్నించారు. రూ.22 వేల కోట్ల ఆస్తులు కలిగిన చండీగఢ్ విద్యుత్తు విభాగాన్ని కేవలం రూ.871 కోట్లకు ప్రైవేటీకరిస్తున్నారని తెలిపారు. రాజస్థాన్‌లోనూ జెన్కోను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. యూపీ, మహారాష్ట్రలోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో పెద్ద యెత్తున పవర్ ఇంజినీర్స్ నిరసన తెలిపారని దూబే తెలిపారు.