1981లో ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాంతాన్ని మైదానం కోసం స్థానికులకు ఇవ్వాలని అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ఆమె లేఖ రాశారు. స్పందించిన రక్షణ శాఖ ఆదేశాలతో ఈ మైదానాన్ని స్థానికులు కూడా వినియోగించుకోవచ్చని ఎన్వోసీ జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఫుట్‌బాట్ గ్రౌండ్‌గా స్థానికులు వినియోగిస్తుండగా.. కంటోన్మెంట్ పరిధిలోని పలు రక్షణ శాఖ విభాగాలు కూడా క్రీడాపోటీలను నిర్వహిస్తుంది. కానీ ఇప్పటికీ కంటోన్మెంట్ సివిలియన్‌కు కూడా ఈ గ్రౌండ్‌ను వినియోగించుకునే వీలు ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు.. ఉన్న గ్రౌండ్‌ను కూల్చివేసి, ప్రహరీతో విశాలమైన ప్రాంతాన్ని ఇరుగ్గా మార్చివేస్తుందని స్థానికులు వాపోతున్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : ఎలివేటెడ్ కారిడార్ పనులతో చారిత్రక పుట్‌బాల్ గ్రౌండ్ కనుమరుగు అవుతున్నది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం ఫుట్‌బాల్ గ్రౌండ్ స్థలాన్ని కంటోన్మెంట్ బోర్డు అప్పగించింది. దీంతో హద్దుల నిర్ధారణ కావడంతోనే ప్రహరీ నిర్మించేందుకు పనులు చేపట్టారు. అయితే చారిత్రక నేపథ్యంతో పాటు, ఎంతో మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నిలబెట్టిన ఈ గ్రౌండ్ కనుమరుగు కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంటోన్మెంట్ భూములను హెచ్ఎండీఏకు అప్పగించడంతో, గ్రౌండ్ పరిధిలో ప్రహరీ నిర్మించేందుకు భారీ గుంతలు తీయడంతో.. ఏళ్లుగా ఈ ప్రాంత వాసులకు అనువుగా ఉండే మైదానం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది ఒలింపిక్ ఫుట్‌బాల్ ప్లేయర్లను దేశానికి అందించిన ప్రాచీన కాలం నాటి మైదానం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తిరుమలగిరిలోని సర్వే నంబర్ 291లో ఉన్న రెండేళ్ల ఎకరాల విస్తీర్ణంలోని గ్రౌండ్ రూపురేఖలు మారిపోనున్నాయి. సువిశాలమైన మైదానంతో ఎంతో మంది క్రీడాకారుల సాధనకు అనువుగా ఉండే తిరుమలగిరి ఫుట్‌బాట్ గ్రౌండ్‌ను స్వాతంత్య్రానికి ముందు నుంచే అందుబాటులో ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఫుట్‌బాల్ ఆడగానే సరిపోదు..
ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ క్రీడాకారులతో ఫుట్‌బాల్ ఆడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఈ ఫుట్‌బాల్ గ్రౌండ్ చరిత్ర తెలియకపోవడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఫుట్‌బాల్ ఆడితే సరిపోదని, ఇలాంటి కీలకమైన ప్రాంతాల్లో ఉన్న విశాలమైన మైదానాలను మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైన పరిరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ సర్కారు మాత్రం ఎలివేటెడ్ కారిడార్ పేరిట విశాలమైన గ్రౌండ్‌ను నిర్వీర్యం చేస్తుందని మండిపడుతున్నారు.