చండీగఢ్, జనవరి 20: ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో డిస్కమ్‌ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్టు విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే ధర్నాల్లో లక్షలాది మం ది విద్యుత్తు శాఖ ఉద్యోగులు పాల్గొంటారని అఖిల భారత పవర్ ఇంజినీర్ల ఫెడరేషన్ తెలిపింది.
యూపీలోని రెండు ప్రభుత్వ డిస్కంలను ప్రైవేటీకరించడం కోసం నిర్వహించనున్న ప్రీ-బిడ్డింగ్ సదస్సును రద్దు చేయాలని ఫెడరేషన్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమా ండ్ చేశారు. వందల కోట్ల రూపాయల విలువైన డిస్కంలను ఏ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టాలనుకుంటున్నదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.22 వేల కోట్ల ఆస్తులు కలిగిన విద్యుత్తు విభాగాన్ని రూ.871 కోట్లకు ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నదని తెలిపారు.