బొగ్గు కొరత వల్లే కరెంట్ కోతలు: మహారాష్ట్ర మంత్రి
ముంబై, ఏప్రిల్ 20: దేశంలోని 12 రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంతో సతమతమవుతున్నాయని మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు. బొగ్గు కొరతే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్తు లోటు 15 శాతంగా ఉందని పేర్కొన్నారు. మహాజెన్‌కో 8 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని, అందుకోసం లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే బొగ్గు రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లు కూడా లేవని ఆయన వాపోయారు. కాగా, దేశంలో విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.