Mamata Banerjee : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఇవాళ ఓట్ల లెక్కింపు (Vote Counting) జరుగుతోంది. అంతటా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే బెంగాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల లెక్కింపునకు ముందు రోజు రాత్రి స్ట్రాంగ్‌రూమ్‌ల (Strong rooms) దగ్గర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె చెప్పారు. పలుచోట్ల స్ట్రాంగ్‌రూమ్‌లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని, సీసీటీవీల (CCTVs) కనెక్షన్లను కట్ చేశారని ఆరోపించారు.
అంతేగాక లెక్కింపునకు ముందురోజు రాత్రి అంతా అనుమానాస్పద కార్యకలాపాలు చేసుకున్నాయని మమత విమర్శించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ ఏజెంట్లు ఏమరుపాటుగా ఉండకూడదని సూచించారు. ఓట్లకు కాపలాగా ఉండాలని కార్యకర్తలను కోరారు. రాత్రంతా మేల్కొని స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతను పర్యవేక్షించానని చెప్పారు. ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాలకు చేరేంతవరకు స్ట్రాంగ్‌రూమ్‌లలో కాపలా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద స్థితిని సృష్టిస్తే వారిని చుట్టుముట్టి వెంటనే ఫిర్యాదు చేయాలని, సీసీటీవీ ఫుటేజీ అడగాలని చెప్పారు.
ఈ అవాంఛనీయ ఘటనలు అన్నీ కూడా బీజేపీ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని మమతాబెనర్జి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఇదిలావుంటే మరికొన్ని గంటల్లో పశ్చిమబెంగాల్లో గెలుపు ఎవరిదనే విషయం తేలిపోనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును ఈ ఫలితాలు నిర్ణయించబోతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మమతకు అనుకూలంగా లేనప్పటికీ తాను నాలుగోసారి విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తంచేశారు.