Priyanka Gandhi : వాయనాడ్ (Wayanad) లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ పోక్కొట్టుంపడంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (Public rally) ఆమె ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే నాయకులనే ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా సేవలు అందించాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలదే అధికారమని అన్నారు.
ప్రస్తుతం దేశాన్ని ప్రతికూల శక్తి ఊడ్చేస్తున్నదని, కానీ కావాల్సింది సానుకూలత, పురోగతి అని ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. సరైన పద్ధతిలో పనిచేస్తే వాయనాడ్‌ను ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా మార్చవచ్చని, అందుకు అవసరమైన సామర్థ్యాలన్నీ వాయనాడ్‌కు ఉన్నాయని ఆమె అన్నారు. వాయనాడ్‌లో ఉన్నంత అందమైన సహజ వనరులు ప్రపంచంలో మరెక్కడా లేవని వ్యాఖ్యానించారు. సరైన రాజకీయాలతో వాయనాడ్‌ను వరల్డ్ క్లాస్ టూరిస్టు సెంటర్‌గా మార్చవచ్చన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై కూడా ప్రియాంకాగాంధీ విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు ద్వారా కేంద్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని వాద్రా గుర్తుచేశారు. కొవిడ్ టైమ్‌లో కూడా కేంద్రం సరైన రీతిలో పనిచేయలేదని, దాంతో ఎందరో చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీరుతో కూలీలు, దుకాణదారులు, రెస్టారెంట్ ఓనర్లు హోటల్ యజమానులు, రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు.