Aviation Safety Rules: విమాన ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానయాన నియంత్రణ, పర్యవేక్షణ సంస్థ డీజీసీఏ కీలక సూచనలు చేసింది. విమాన ప్రయాణికులు పవర్ బ్యాంక్, అదనపు బ్యాటరీలు వాడే విషయంలో తాజాగా కొన్ని నిబంధనల్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇకపై విమాన ప్రయాణికులు హ్యాండ్ లగేజ్ లో మాత్రమే పవర్ బ్యాంక్, అడిషనల్ బ్యాటరీలు, ఇతర లిథియం బ్యాటరీ డివైజ్ లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్, ఇతర కార్గో లగేజ్ లలో వీటిని తీసుకెళ్లడానికి అనుమతించరు. దీని ద్వారా విమానంలో ప్రయాణికులకు మరింత భద్రత కలగనుంది.
ఇటీవల ఈ నిబంధనలకు సంబంధించి డీజీసీఏ ‘డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్’ జారీ చేసింది. సాధారణంగా లిథియం బ్యాటరీలు కొన్ని సార్లు వేడెక్కి పేలడం, వాటి ద్వారా నిప్పు రవ్వలు అంటుకుని మంటలు వ్యాపించడం వంటివి జరుగుతున్నాయి. అందులోనూ విమానం గాల్లో ఉండగా ఇలా బ్యాటరీలు పేలడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గాల్లో మంటల్ని నియంత్రించడం సాధ్యం కాదు. విమానాల్లోని ఓవర్ హెడ్ కంపార్టుమెంట్లు, కార్గోలు వంటి వాటిల్లో బ్యాటరీల ద్వారా అగ్నిప్రమాదాలను త్వరగా గుర్తించడం సాధ్యం కావట్లేదు. అందుకే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. హ్యాండ్ లగేజ్ లో మాత్రమే ఇవి ఉంటే.. వీటి ద్వారా ఎప్పుడైనా అనుకోని ఘటనలు జరిగితే ముందుగానే గుర్తించి నియంత్రించే వీలుంది.
ఇటీవల కొన్ని విమానాల్లో పవర్ బ్యాంకుల ద్వారా మొబైల్స్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, ఎయిర్ క్రాఫ్ట్ సీట్ పవర్ ఔట్లెట్లలో చార్జింగ్ చేస్తున్నప్పుడు అవి పేలి కొన్ని అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై విమాన ప్రయాణానికి ముందుగా ఈ విషయంలో జాగ్రత్తగా తనిఖీలు చేస్తారు. హ్యాండ్ లగేజీలలో మాత్రమే వీటని అనుమతిస్తారు. విమానంలో కూడా స్పష్టమైన ప్రకటన, హెచ్చరికలు జారీ చేస్తారు. గత అక్టోబర్లో ఒక దేశీయ విమానంలో పవర్ బ్యాంక్ పేలడం వల్ల విమానాన్ని మధ్యలో దింపాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.