న్యూఢిల్లీ/ సిమ్లా/ తిరువనంతపురం : ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షం, బలమైన గాలుల వల్ల న్యూఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1లోని పైకప్పు ఛత్రం కూలింది. భారీ వర్షం, గంటకు 82 కి.మీ వేగంతో వీచిన గాలుల కారణంగా 49 విమానాలను దారి మళ్లించారు. వర్షం వల్ల నగరంలోని చాలా రోడ్లలో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు వర్షాలు, కొండ చరియలు విరగడం వల్ల ఉత్తరాఖండ్‌లోని ఏడో నంబర్ జాతీయ రహదారిపై(బద్రీనాథ్ హైవే) 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రముఖ యాత్రా స్థలాలున్న చోట పర్యాటకుల వాహనాలు రోడ్డు మీదే కిక్కిరిసిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. పాతిక వాహనాల వరకు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆది, సోమవారాలు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
కేరళను ముందుగానే తాకిన నైరుతి రుతు పవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల పలు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో కొన్ని చోట్ల ఆనకట్టల గేట్లు ఎత్తేశారు. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో కొన్ని ఇండ్లు దెబ్బ తిన్నాయి. త్రిస్సూర్ జిల్లాలో వంతెనపై ప్రయాణిస్తున్న రైలుపై ఒక చెట్టు విరిగిపడింది. అయితే లోకో పైలట్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కోజికోడ్ జిల్లాలో కొబ్బరి చెట్టు మీద పడి స్కూటర్‌పై వెళుతున్న వృద్ధుడు మరణించాడు. వయనాడ్‌లో కొండ చరియలు విరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.