(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే క్లియరెన్స్ కోసం బారామతి ఏటీసీ అధికారులను సంప్రదించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో విజిబులిటీ చాలా తక్కువగా ఉండటంతో.. ‘రన్‌వే కనిపిస్తుందా? లేదా??’ అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారు. ఈ మేరకు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏటీసీ ప్రశ్నకు.. కనిపించడంలేదని పైలట్లు సమాధానమిచ్చారు.
దీంతో క్లియరెన్స్ రాలేదని, ఈ క్రమంలో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్టు మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని ఏటీసీ అధికారుల ప్రశ్నకు పైలట్లు సానుకూలంగా స్పందించడంతో క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 8.42 గంటల సమయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించగా.. విజిబులిటీ సమస్యలతోపాటు నియంత్రణ కోల్పోవడంతో రన్‌వేకు దగ్గరగా ఉన్న ఓ బండరాయికి ఢీకొని 8.48గంటల ప్రాంతంలో పెద్ద మంటతో విమానం కూలిపోయినట్టు సమాచారం. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో ఎరౌండ్ పాటించారని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నట్టు తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్ రాలేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి.

లియర్‌జెట్-45 విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా వ్యవహరించిన కెప్టెన్ సుమిత్‌కు 16,500 గంటల విమానం నడిపిన అనుభవం ఉన్నదని అధికారులు తెలిపారు. యువ పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ చిన్న వయసులోనే కమర్షియల్ విమానాలను నడిపే లైసెన్స్ పొందారని పేర్కొన్నారు. 2016-18లో సెకండరీ విద్యను పూర్తిచేసిన ఈమె.. ముంబై యూనివర్సిటీ నుంచి ఏవియేషన్‌లో డిగ్రీ పొందారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ పొందారు.

విమాన ప్రమాదంలో మరణించిన ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ చివరిగా తనతో అన్న మాటలను ఆమె తండ్రి శివకుమార్ గుర్తు చేసుకొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనతో ఫోన్లో మాట్లాడిన పింకీ.. ‘నాన్న.. బుధవారం డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో కలిసి బారామతి వెళ్తున్నా.. ఆయన్ని డ్రాప్ చేశాక అటు నుంచి నాందేడ్ వెళ్తా. హోటల్‌కు చేరుకోగానే ఫోన్ చేస్తా’ అని పింకీ తనతో అన్నట్టు ఆమె తండ్రి గుర్తు చేసుకొన్నారు. తన కుమార్తెతో మాట్లాడే అవకాశం ఇక మళ్లీ రాబోదన్న శివకుమార్.. మృతదేహాన్ని అప్పగిస్తే.. ఆమెకు గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తానని విజ్ఞప్తి చేశారు.