Siddaramaiah | తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాను నటించిన థగ్‌లైఫ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితం, నా కుటుంబం తమిళ భాష’ అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై కన్నడిగులు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు.
ఈ మేరకు నటుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదని పేర్కొన్నారు. కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. కమల్ హాసన్‌కు ఆ విషయాలన్నీ తెలియవంటూ ఎద్దేవా చేశారు. ‘కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదు. కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్‌కు ఆ విషయాలన్నీ తెలియదనుకుంటా’ అంటూ వ్యాఖ్యానించారు.
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు.
Also Read..
Kamal Hassan | కన్నడ భాషపై కమల్ హాసన్ సంచలన కామెంట్స్.. మండిపడుతున్న కన్నడిగులు
Deepika Padukone | మనసు చెప్పిందే వింటాను.. దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు