Kamal Hassan | మరి కొద్ది రోజులలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో కమల్ లేని పోని చిక్కుల్లో పడ్డాడు. మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ వేదికపై ఉన్నారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. అంటే కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించింది అన్నట్టుగా కమల్ కామెంట్స్ ఉండడంతో కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ… కమల్ హాసన్ ‘సంస్కారం లేని వ్యక్తి’ అని, కన్నడ భాషను అవమానించారంటూ మండిపడ్డారు.
‘మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్‌కుమార్‌ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడం అహంకారమే అవుతుందని ఆయన అన్నారు. మరోవైపు కమల్ హాసన్ తన సినిమాను ప్రమోట్ చేయడానికి బెంగళూరులోని ఓ వేదికపై పాల్గొనబోతున్నారని తెలుసుకున్న కన్నడ అనుకూల సంఘాలు ఆయనపై నల్ల సిరా విసిరి నిరసనను తెలియజేయాలని అనుకున్నారట. అది తెలుసుకున్న కమల్ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తుంది. కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై సరైన వివరణ ఇవ్వకపోయిన, లేదా క్షమాపణ చెప్పకపోయిన సరే అతని సినిమాలను కర్ణాటకలో పూర్తిగా బహిష్కరిస్తామని కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.