న్యూఢిల్లీ: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాను నటించిన థగ్‌లైఫ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితం, నా కుటుంబం తమిళ భాష’ అని పేర్కొన్నారు. ‘నటుడు శివరాజ్‌కుమార్ మరో రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు.
అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు.