న్యూఢిల్లీ, జూలై 29: వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ల నిర్వహణ తీరు, విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కోచింగ్ సెంటర్లు, పరిసర ప్రాంతాల్లోని దుర్భర పరిస్థితులను వివరిస్తూ తాజాగా అవినాశ్ దూబే అనే ఓ సివిల్స్ అభ్యర్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. తాము నరకం లాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు అభ్యర్థుల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన వాతావరణంలో చదువుకొనేందుకు విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థించారు. రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ వంటి ఏరియాల్లోని మౌలిక సదుపాయాల మృగ్యాన్ని సీజేఐకు రాసిన లేఖలో అవినాశ్ దూబే వివరించారు. డ్రైనేజీ సమస్యల కారణంగా తరచుగా సంభవించే వరదలతో స్థానికులు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తున్నదన్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రతి ఏడాది వీధుల్లో, రోడ్లపై భారీగా నీరు నిలుస్తున్నదని, దీనికి మురుగు నీరు తోడవుతుందని, తాము మోకాళ్ల లోతు నీళ్లలో నడవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. వరద, మురుగు నీరు కొన్నిసార్లు ఇండ్లలోకి కూడా వస్తున్నదని అవినాశ్ దూబే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన నరకయాతన అనుభవిస్తూ తమ లాంటి అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారని సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఆ లేఖను పిటిషన్‌గా తీసుకోవాలా? అనే దానిపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోలేదు. రాజేందర్ నగర్‌లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడంతో తాన్యా సోనీ, శ్రేయ యాదవ్, నవీన్ దెల్విన్ అనే ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, పటేల్ నగర్లో విద్యుదాఘాతంతో నిలేశ్ రాయ్ మరణించాడు.
ఓల్డ్ రాజేంద్ర నగర్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలిసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అక్కడకు వచ్చారు. ఆయన్ను అభ్యర్థులు ఘెరావ్ చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వెనుక నుంచి కాకుండా తమను కలిసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు నినాదాలు తీవ్రం చేయడంతో ఎల్జీ సక్సేనా అభ్యర్థులతో సరిగ్గా మాట్లాడకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. అభ్యర్థుల మృతి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామని ఈ సందర్భంగా ఎల్జీ ఆందోళనకారులకు హామీ ఇచ్చారని అధికారులు వెల్లడించారు.
రావుస్ ఘటనకు సంబంధించి మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో అరెస్టు చేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే రావుస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని, కోఆర్డినేటర్‌ను అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే. మరోవైపు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూ ల్చివేత ప్రారంభమైంది. ముగ్గురు అభ్యర్థుల మృతిపై దర్యాప్తునకు అదనపు కార్యదర్శి నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించనుంది. బాధితుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది.
ముగ్గురు అభ్యర్థుల మృతి ఘటన నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. ఓల్డ్ రాజేంద్ర నగర్ ఏరియాలో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న 20 కోచింగ్ సెంటర్లను సీల్ చేశారు. వీటిలో ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ప్లూటస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సందావ్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యా గురు, గైడెన్స్ ఐఏఎస్, ఈజీ ఫర్ ఐఏఎస్ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ కోచింగ్ సెంటర్లను బేస్మెంట్లలో నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. రావుస్ ఘటనకు సంబంధించి జూనియర్ ఇంజినీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించగా, మరో అసిస్టెంట్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేశారు. రావుస్ స్టడీ సర్కిల్ బిల్డింగ్ ఎన్వోసీ రద్దు ప్రక్రియను అగ్నిమాపక విభాగం ప్రారంభించింది.