లక్నో: రాజకీయాలు తనకు పూర్తి కాల ఉద్యోగం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతిమంగా తాను ఒక యోగినేనని ఆయన చెప్పారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. యూపీ అభివృద్ధిలో ముస్లింలు తగిన భాగాన్ని పొందుతారని.. అయితే వాళ్లు మైనారిటీలు అయినందున ప్రత్యేక రాయితీలు వస్తాయని ఆశించొద్దని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులు సమాజానికి ఏమీ తిరిగివ్వడం లేదని.. చివరికి ముస్లింలకు కూడా అవి ఏమీ ప్రయోజనం చేకూర్చడం లేదని ఆయన విమర్శించారు. తెలుగు, తమిళం, బెంగాలీ లేదా మరాఠీ లాంటి భాషలు దేశ ఐక్యతకు పునాది రాళ్లుగా ఉపయోగపడుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో ప్రాంతీయ భాషలు బోధిస్తున్నామని చెప్పారు. హిందీ గౌరవం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.