చెన్నై: తమిళనాడు శానససభ ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళ కొత్తగా ప్రారంభించిన ఆల్ ఇండియా తలైవర్ మక్కల్, మున్నేట్ర కజగం (ఏఐపీటీఎంఎంకే), రామదాస్‌కు చెందిన పీఎంకే మధ్య పొత్తు కుదిరింది. అన్ని సీట్లలో పోటీ చేయాలని వీరు నిర్ణయించారు. వీరి పొత్తు తెవర్, వన్నియార్ సామాజిక వర్గాలను ఏకం చేస్తూ, ముఖ్యంగా ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు నష్టం చేసే శక్తిగా మారనుంది.
అక్రమాస్తుల కేసులో జైలు పాలైన శశికళ.. ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు కావడమే కాక ఏఐఏడీఎంకే కూటమిని ముందుంచి నడిపించే అవకాశం కోల్పోయింది. దీంతో తనను వేధించిన మాజీ సీఎం పళనిస్వామి, మేనల్లుడు దికనకరన్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఆమె లక్ష్యం ఎన్డీఏ కూటమిని ఓడించడం. శశికళ జైలుకు వెళ్లడంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి పళనిస్వామి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. తర్వాత ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. విడుదలైనప్పటికీ ఆమెను పార్టీలో చేర్చుకోలేదు. కొంతకాలంగా పళనిస్వామితో విభేదించిన పన్నీర్ సెల్వం ఇటీవలే డీఎంకేలో చేరారు.
దినకరన్ కూడా ఏఐఏడీఎంకేతో రాజీపడి ఎన్డీఏ కూటమిలో చేరడం శశికళ అసంతృప్తిని మరింత పెంచింది. గత ఎన్నికల్లో తేవర్ ఓట్లు చీలడం ఏఐఏడీఎంకే ఓటమికి కారణమైంది. శశికళ కొత్త కూటమి ద్వారా తిరిగి ప్రవేశించడం చూస్తే ఈ ఓట్ల పునాదిని ఆమె మరింత విచ్ఛిన్నం చేస్తుందని భావిస్తున్నారు. మరో వైపు రామదాస్ కూడా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న అతని కుమారుడు అన్బుమణితో విభేదిస్తున్నారు. దీంతో ఆయన శశికళతో చేతులు కలిపారు. ఉత్తర తమిళనాడులోని వన్నియార్ ఓటర్లపై ఆయన ప్రభావం చూపగలరని భావిస్తున్నారు. గెలుపుపై వీరిద్దరికీ పూర్తి ఆశలు లేకపోయినా ఓట్లను చీల్చడం ద్వారా తమ ప్రత్యర్థులను దెబ్బతియ్యాలన్న కృతనిశ్చయం మాత్రం వీరిలో కన్పిస్తున్నది.