న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీలు, నాయకులు ప్రశంసలు కురిపించారు. సైన్యం పనితీరు, పరాక్రమాలను చూసి గర్విస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఎవరేమన్నారంటే…
పహల్గాంలో అమాయక సోదరులను క్రూరంగా చంపిన ఘటనకు భారత్ ఇచ్చిన ప్రతిస్పందనే ఆపరేషన్ సిందూర్.
– అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
మన అమాయకులను చంపిన వారిని మాత్రమే మేం చంపాం. మన చర్య చాలా వివేచనతో తీసుకున్నది. టెర్రరిస్టుల నైతిక స్థెర్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా కేవలం వారి శిబిరాలపైనే దాడులు చేశాం.
-రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ మంత్రి
ఉగ్రవాదం పట్ల ప్రపంచం అస్సలు దయ చూపనే కూడదు.
– జైశంకర్, కేంద్ర విదేశాంగ మంత్రి
జాతీయ ఐక్యత, సంఘీభావం ప్రస్తుతం అవసరం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.
– మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో సైన్యానికి, దేశానికి తమిళనాడు అండగా, తోడుగా ఉంటుంది.
-స్టాలిన్, తమిళనాడు సీఎం
జైహింద్! జై ఇండియా!
– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం
దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. భారత సైన్యం శౌర్య పరాక్రమాలు దేశం మొత్తాన్ని గర్వించేలా చేశాయి.
– నితీశ్ కుమార్, బీహార్ సీఎం
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేస్తున్న ఈ పోరాటానికి 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారు. భారత్‌కు జయం.
– అరవింద్ కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్
మరో పహల్గాం దాడి ఇంకెప్పుడూ జరగకుండా పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం నేర్పించాలి. ఆ దేశ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్.
– అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం చీఫ్