న్యూఢిల్లీ, మే 22 (నమస్తే తెలంగాణ): దేశంలోని రాజకీయ పార్టీలకు అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వందల కోట్ల రూపాయాలు వచ్చిపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో 76 శాతానికిపైగా(దాదాపు రూ.887 కోట్లు) ఈ విధంగానే వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. గుర్తుతెలియని విరాళాల్లో కూడా 93.26 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినవేనని తెలిపింది. అనామక వనరుల నుంచి అత్యధిక ఆదాయం పొందిన జాబితాలో రూ.306.02 కోట్లతో డీఎంకే మొదటి స్థానంలో ఉన్నది.
తర్వాతి స్థానంలో బీజేడీ(291.09 కోట్లు)ఉన్నది. రూ.20 వేల కంటే ఎక్కువ వచ్చిన విరాళాల వివరాలనే ఎన్నికల కమిషన్కు రాజకీయ పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం 27 పార్టీలు 2021-22లో రూ.1,165 కోట్లు ఆదాయాన్ని ప్రకటించాయి, ఇందులో రూ.145.42 (12.48%) కోట్లు తెలిసిన దాతల నుండి వచ్చినట్లు తెలిపాయని ఏడీఆర్ పేర్కొన్నది. సభ్యత్వ రుసుము, బ్యాంకు వడ్డీ, ప్రచురణల విక్రయంతోపాటు తెలిసిన ఇతర మార్గాల ద్వారా ద్వారా రూ.132.60 కోట్లు వచ్చాయని నివేదిక వెల్లడించింది. 2020-21లో ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.530.70 కోట్లు ఉండగా.. ఇది 2021-22లో రెట్టింపు కంటే ఎక్కువైంది.