అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విజయ్‌చౌక్ వద్దే నిలిపివేశారు. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వెనక్కి వచ్చిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/ న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని విజయ్ చౌక్ వద్దే అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు పోనీయకుండా ఆపారు. ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నదని, ర్యాలీ చేసేందుకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారని, ర్యాలీగా వెళ్లేందుకు బయలుదేరిన 200 మంది ఎంపీలను అడ్డుకొనేందుకు 2 వేల మంది పోలీసులను మోహరించారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
పోలీసుల అడ్డంకుల నేపథ్యంలో వెనక్కు వచ్చిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా దాడులు చేయిస్తుందని, అదానీ వంటి వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అదానీ వ్యవహారంపై తక్షణమే జేపీసీ వేసి, నిజాలను నిగ్గు తేల్చాల్చిందేనంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. ర్యాలీని పోలీసులు అడ్డుకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్తో సహా విపక్ష పార్టీలు ఈడీ డైరెక్టర్ ఎస్కే మిశ్రాకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపాయి. అదానీ గ్రూప్ అక్రమాలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాయి.
జేపీసీ వేయాల్సిందే..
మరోవైపు అదానీ వ్యవహారంపై వరుసగా మూడో రోజూ పార్లమెంట్ దద్దరిల్లింది. బీఆర్ఎస్తో పాటు పలు ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలతో బుధవారం ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై తక్షణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, విపక్ష ఎంపీలతో ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది.
వాస్తవాలు ప్రజల ముందుంచాలి
అదానీ గ్రూపు వ్యవహారం పెద్ద కుంభకోణమని, ఆ గ్రూప్‌లో ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల పెట్టుబడులు ఉన్నాయని.. అదానీ అంశంలో దర్యాప్తు జరిపించాలని ఈడీకి రాసిన లేఖలో కోరినట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ‘ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుకు ప్రభుత్వం ఒక వ్యక్తికి డబ్బు ఇస్తున్నది. గతంలో కొద్దిపాటి వ్యాపారాలు ఉన్న ఓ వ్యక్తి అనూహ్యంగా రూ.13 లక్షల కోట్లకు ఎగబాకారు. ఇది ఎలా సాధ్యం? ఎవరు డబ్బు ఇస్తున్నారు.. మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అనే అంశాలను లేఖలో ప్రస్తావించినట్టు నామా పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతుకను కేంద్రం అణచివేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ మొండివైఖరి వీడి తక్షణం అదానీ అంశంపై జేపీసీ వేసి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని మానుకోవాలని, కేంద్రం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
లేఖలో ఏముందంటే..
అదానీ గ్రూప్ అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించాలని 16 విపక్ష పార్టీలు ఈడీ డైరెక్టర్ ఎస్కె మిశ్రాకు ఈమెయిల్లో లేఖ పంపాయి. ఈ విషయంలో ఈడీ తన బాధ్యతలు, అధికార పరిధిని త్యజించలేదని పేర్కొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఎస్ఎస్ (యూబీటీ), ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఐయూఎంఎల్, వీసీకే, కేరళ కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు లేఖపై సంతకాలు చేశాయి. అదానీ గ్రూప్ మనీలాండరింగ్, నకిలీ కంపెనీల ఏర్పాటు, షేర్ల ధర పెంపు ఇలా అనేక అంశాల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించాయి. రాజకీయ ప్రేరేపితంతో ఒక పార్టీకి అనుకూలంగా ఈడీ వ్యవహరిస్తున్న తీరు, పలువురిపై కేసులు నమోదు చేస్తున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నాయి.
కనీసం ప్రాథమిక దర్యాప్తయినా జరిపారా?
అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై ఇంతవరకు ప్రాథమిక దర్యాప్తును సైతం ప్రారంభించకపోవడాన్ని విపక్ష నేతలు తప్పుబట్టారు. కార్పొరేట్ అక్రమాలు, రాజకీయ అవినీతి, స్టాక్ ధరల పెంపు, ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చడం, ఒక కార్పొరేట్ కంపెనీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడం వంటి అనేక అంశాలు అదానీ గ్రూప్ అక్రమాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. ముంద్ర పోర్టులో సెప్టెంబర్ 2021లో పెద్దఎత్తున మాదక ద్రవ్యాల స్వాధీనం జరిగినా అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న ఆ పోర్టుపై దర్యాప్తు జరపలేదన్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి అదానీ సంస్థలు పెద్దమొత్తంలో రుణాలు తీసుకోవడం అవినీతి, చట్టాల ఉల్లంఘనకు పాల్పడటమేనని వ్యాఖ్యానించారు.