న్యూఢిల్లీ, అక్టోబర్ 31 : చట్టంలో పొందుపరిచిన నిర్దిష్టమైన మినహాయింపులు ఉంటే తప్ప నిందితుడి తరఫున వాదిస్తున్న న్యాయవాదిని ప్రశ్నించేందుకు సమన్లు జారీచేసే అధికారం దర్యాప్తు అధికారికి లేదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. న్యాయవాదులకు సమన్లు జారీచేయడం నిందితుడి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారితీయగలదని, అంతేగాక న్యాయవాది-క్లయింట్ గోప్యతకు చెందిన చట్టపరమైన రక్షణల ఉల్లంఘన కాగలదని కోర్టు స్పష్టం చేసింది. ఒక కేసులో దర్యాప్తు అధికారి జారీచేసిన సమన్లను పక్కనపెడుతూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్ఏ)లోని సెక్షన్ 132 కింద(లాయర్లు, క్లయింట్ల మధ్య రహస్య సంభాషణల రక్షణ) మినహాయింపులు ఉంటే తప్ప న్యాయవాదుల నుంచి క్లయింట్ వివరాలను దర్యాప్తు అధికారులు కోరలేరని ధర్మాసనం తెలిపింది.
డిజిటల్ పరికరాల స్వాధీనాన్ని ప్రస్తావిస్తూ భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 94 కింద అటువంటి పరికరాలను తమ పరిధిలోని కోర్టుల ఎదుటే సమర్పించాల్సి ఉంటుందని, ఇందుకోసం సంబంధిత కక్షిదారునికి నోటీసు జారీచేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కక్షిదారుడు, వారి న్యాయవాది, వారు కోరుకున్న డిజిటల్ నిపుణుల సమక్షంలోనే పరికరాన్ని ఓపెన్ చేయాలని కోర్టు తెలిపింది. దర్యాప్తు సందర్భంగా నిందితుల తరఫున న్యాయపరమైన సలహాలు ఇస్తున్నందుకు సీనియర్ న్యాయవాదులు అరవింద్ దతర్, ప్రతాప్ వేణుగోపాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీచేయడాన్ని సుమోటోగా జూలై 8న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుంచి సవివరంగా వాదనలు విన్న అనంతరం ఆగస్టు 12న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం తీర్పు వెలువరించింది.