Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 12: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రణాళిక శాఖ మంత్రిగా ఉన్న డీ సుధాకర్‌పై భూకబ్జా కేసు నమోదైంది. దళితుల భూమిని ఆక్రమించుకొనేందుకు యత్నించారన్న ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో ఇద్దరిపై యెలహంక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంత్రి సుధాకర్, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ కింద కేసు నమోదైంది.
ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పార్ట్నర్గా ఉన్న మంత్రి సుధాకర్.. సుబ్బమ్మ అనే దళిత మహిళకు చెందిన భూమిని ఆక్రమించుకొనేందుకు తన అనుచరులతో కలిసి యత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటుగా ఆక్రమణను అడ్డుకొన్న బాధితురాలి కుమార్తెపై కూడా దాడి చేశారని ఫిర్యాదు అందిందని పొలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ భూమిపై వివాదానికి సంబంధించిన కేసు ఓవైపు కోర్టులో పెండింగ్‌లో ఉన్నది. అయినా నిందితులు తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, ఇండ్లు కూల్చివేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారని బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీసుల వద్దకు వెళ్లేందుకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించారు.