PM Modi | వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ (NDA) కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలకు (Opposition) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విజ్ఞప్తి చేశారు.
సీపీ రాధాకృష్ణన్ వివాదాలు లేని జీవితాన్ని గడిపారని, ఆయన చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. ఈ విషయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీల ఎంపీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ పరిచయం చేశారు. అనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు.
ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచి శివ?
మరోవైపు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివ (Tiruchi Shiva)ను ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపికే చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అధికార ఎన్డీఏ తన అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ని ప్రకటించిన నేపథ్యంలో ప్రాంతీయ రాజకీయాల వల్ల ఎదురయ్యే అవరోధాన్ని అధిగమించేందుకు అదే రాష్ర్టానికి చెందిన మరో నాయకుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నది. అభ్యర్థిని నిర్ణయించేందుకు ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాతే ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థి పేరు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
Also Read..
PM Modi: 50 మంది వ్యోమగాముల్ని తయారు చేయాలి: శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ
Spinning Ride | ఆలయ ఉత్సవంలో అపశ్రుతి.. స్పిన్నింగ్ రైడ్ కూలి ఐదుగురికి గాయాలు.. షాకింగ్ వీడియో