Gaurav Gogoi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. లోక్సభ (Lok Sabha) లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను.. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తప్పుపట్టారు. వందేమాతరం (Vandemataram) పై చర్చ సందర్భంగా ప్రధాని దేశ చరిత్రను వక్రీకరించి తిరగరాసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
బీజేపీ ఎంత ప్రయత్నించినా నెహ్రూ వారసత్వాన్ని అడ్డుకోలేదని గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. వందేమాతరం గేయానికి ప్రాముఖ్యతను ఇచ్చింది, ఆ గేయానికి జాతీయ గేయం హోదాను కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. ఏ అంశంపై మాట్లాడినా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరును, కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ నెహ్రూ పేరును 14 సార్లు, కాంగ్రెస పార్టీ పేరును 50 సార్లు ప్రస్తావించారని గొగోయ్ తెలిపారు. అదేవిధంగా 75వ రాజ్యాంగ దినోత్సవరం సందర్భంగా కూడా ప్రధాని మాట్లాడుతూ.. నెహ్రూ పేరును 10 సార్లు, కాంగ్రెస్ పేరును 26 సార్లు ప్రస్తావించారని చెప్పారు. వందేమాతరం గేయానికి ప్రాముఖ్యతనిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.