PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక (Karnataka) ప్రజలతో ప్రమాణం చేయించారు. దేశం అభివృద్ధి చెందాలంటే తాను చెప్పే తొమ్మది పనులు చేయాలని, ఆ తొమ్మిది పనులు చేస్తామని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. ఆ మేరకు ప్రజల చేత ప్రమాణం చేయించారు. ఇవాళ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠం (Adichunchanagiri Mahasamsthana Matt) ను ప్రధాని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రజల నుంచి 9 పనులపై హామీ తీసుకున్నారు.
‘మీ నుంచి నాకు తొమ్మిది హామీలు కావాలి. వికసిత్ కర్ణాటక కోసం మీరంతా నాకు ఆ 9 హామీలు నెరవేరుస్తామని ప్రమాణం చేయండి. ఈ ప్రమాణాలను శ్రద్ధగా, నిజాయతీగా పాటిస్తే కర్ణాటకతోపాటు దేశ అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఆ తర్వాత ఆ 9 పనుల గురించి ప్రజలకు తెలియజేశారు. నీళ్లను వృథా చేయకుండా పొదుపుగా వాడతామని, పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిస్తామని, అమ్మ పేరుతో మొక్కలు నాటుతామని ప్రజల నుంచి ప్రధాని హామీ తీసుకున్నారు.
అదేవిధంగా ‘వోకల్ ఫర్ లోకల్’ స్వదేశీయతను చాటి చెబుతామని, జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, రసాయనాలు లేకుండా పంట సాగు చేస్తామని, ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటామని, నూనె పదార్థాలను పూర్తిగా తగ్గిస్తామని, ఫిట్‌గా, బరువుని అదుపులో ఉంచుకుంటూ ప్రకృతికి సేవ చేస్తామని ప్రధాని హామీలు పొందారు. ఇలా మొత్తం 9 పనులకు సంబంధించిన హామీలను ప్రధాని తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కొన్ని కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వైద్య సౌకర్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా వైద్యం పొందే అవకాశం కల్పిస్తున్నామని గుర్తుచేశారు.