NDA | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : ‘అచ్చేదిన్’ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు.. ప్రజలకు సచ్చేదినాలను చూయిస్తున్నది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉగ్రదాడులతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ పదకొండేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం నిలువునా ముంచింది.
ధరాభారం: ప్రధాని మోదీ 11 ఏండ్లపాలనలో నిత్యావసరాల ధరలు 10 నుంచి 200 శాతం వరకూ పెరిగాయి. బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, చింతపండుతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటాయి.
నిరుద్యోగం: ఏటా రెండు కోట్ల చొప్పున ఉద్యోగాల భర్తీ చేపడుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు. దేశంలో నిరుద్యోగిత రేటు కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. డిగ్రీ పూర్తైన 42 శాతం మందికి ఉద్యోగాలు లేవని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. మోదీ ఇచ్చిన మాటప్రకారం.. గడిచిన 11 ఏండ్లలో 22 కోట్ల ఉద్యోగ ఖాళీలను నింపాలి. అయితే, 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి.
దేశభద్రత: గడిచిన పదకొండేండ్ల కాలంలో దేశంలో ఉగ్రదాడి ఘటనలు పెరిగిపోయాయి.2014 నుంచి ఇప్పటివరకూ ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే 11 ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. ఈ దాడుల్లో 103 మంది సైనికులు, 44 మంది పౌరులు మరణించారు. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి, 2019లో జరిగిన పుల్వామా దాడి, తాజాగా పహల్గాం ఉగ్రదాడితో యావత్తు దేశం వణికిపోయింది.
దౌత్యవైఫల్యం: గడిచిన 11 ఏండ్లలో ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమయ్యారు. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్ వంటి దేశాలూ మనకు వ్యతిరేకంగా మారి చైనాకు అనుకూలంగా మారడమే ఇందుకు రుజువు. ఇక, పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడంలోనూ, అమెరికా ప్రతీకార సుంకాలు, భారతీయ విద్యార్థులపై ఆంక్షలను తప్పించడంలోనూ ఎన్డీయే సర్కారు చేతులెత్తేసింది.
బ్లాక్‌మనీ-రైటాఫ్‌లు: బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో ఉన్న నల్ల ధనాన్ని మొత్తం వెనక్కిరప్పిస్తామని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. వాస్తవంలో మాత్రం బ్లాక్ మనీ వెనక్కు తీసుకురాకపోగా.. ఎన్డీయే పాలనతో స్విస్ బ్యాంకులో భారతీయుల బ్లాక్ మనీ పెరిగింది. ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పలాయనం చిత్తగించారు. ఎన్డీయే పాలనలో బ్యాంకులు ఇప్పటివరకూ రూ. 16.35 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను రైటాఫ్ చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఒప్పుకొన్నది.
పెద్ద నోట్లరద్దు-రూపాయి పతనం: నోట్లను రద్దు చేయడం ద్వారా నకిలీ నోట్లను అరికడతామని, అవినీతి సొమ్ము బయటకు వస్తుందని ఎన్డీయే సర్కారు పెద్ద నోట్ల రద్దు చేసింది. కోట్లాది మంది పేదలను బ్యాంకులు, ఏటీఎంల ముందు లైన్లలో నిలబెట్టింది. వందలాది మంది ఆ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ నోట్ల రద్దు విఫలం అయింది.
జీఎస్టీ: అనేక రకాల పన్నులతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే దేశం-ఒకే ట్యాక్స్ ఉంటే సులువుగా ఉంటుందని కేంద్రం రాష్ర్టాలను బలవంతంగా ఒప్పించి మరీ జీఎస్టీని తీసుకువచ్చింది. హేతుబద్ధత లేని ట్యాక్స్ స్లాబులతో ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
సీఏఏ: పొరుగుదేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్నవారికి ఆశ్రయం కల్పిస్తామంటూ ఎన్డీయే సర్కారు పౌరసత్వ చట్టానికి సవరణ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం ఎగిసిపడింది.
పీఎస్‌యూల ప్రైవేటీకరణ: లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడమే పనిగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఎల్ఐసీలో కొంత వాటాను ప్రైవేటు పరం చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
కరోనా లాక్డౌన్: కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ రాత్రికిరాత్రే దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది వలస కార్మికులు కాలినడక వేల కిలోమీటర్ల దూరం నడుచుకొంటూ స్వస్థలాలకు వెళ్లారు. మార్గ మధ్యలో ఆకలికి తాళలేక, ప్రమాదాల్లో వందలాది మంది చనిపోయారు.
సాగుచట్టాలు: రైతులు వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా సాగు చట్టాలను తీసుకువచ్చింది. నిరసనల్లో ఏడు వందల మందికి పైగా రైతులు చనిపోయారు. చివరికి ప్రధాని మోదీ తాపీగా.. రైతులకు సారీ చెప్పి సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించారు.