స్పెషల్ టాస్క్ బ్యూరో, న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రశాంత కశ్మీరంలో పాకిస్థాన్ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకొనే సమయం ఆసన్నమైంది? 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గరపడ్డాయా? ఉగ్రమూకలను తుదముట్టించే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) సహా త్రివిధ దళాల అధిపతులతో తన నివాసంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడిపై ప్రతిస్పందించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, లక్ష్యాలు, సమయం ఇలా సమస్తం అన్ని అంశాల్లో సైన్యానికి పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్తు జాతి ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నది. ఈ దాడికి పాల్పడిన ముష్కరులతోపాటు వారికి అండగా ఉన్న సూత్రధారులపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండు తీవ్రతరమైంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. ఉగ్రదాడికి ప్రతి దాడిలో అనుసరించాల్సిన పద్ధతులు (మోడ్ ఆఫ్ యాక్షన్స్), లక్ష్యాలు (టార్గెట్స్), సమయం (టైమ్) ఇలా అన్నింటిపై నిర్ణయం తీసుకొనే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నదే దేశ సంకల్పమన్న ప్రధాని.. భారత సాయుధ దళాల శక్తి, సామర్థ్యాలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉన్నదన్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ చీఫ్లు పాల్గొన్నారు.
సీడీఎస్ సహా త్రివిధ దళాల అధిపతులతో మోదీ సమావేశం పూర్తయిన వెంటనే.. ప్రధాని నివాసానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా కలిసి వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, గత వారం ఓ సభలో భాగవత్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు గట్టిగా బదులివ్వాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. వారం వ్యవధిలో ఈ భేటీ రెండోసారి.
2016లో ఉరిలో జరిగిన ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. దీంతో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం మెరుపుదాడులు చేసి పాక్కు తగిన బుద్ధి చెప్పింది. ఇక, 2019లో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులవ్వగా, మరో 35 మందికి గాయాలయ్యాయి. దీంతో ఉగ్రమూకల స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులపై భారత సాయుద దళాలు ఏ విధంగా ప్రతీకార చర్యలు చేపడుతాయోనన్నది ఆసక్తిగా మారింది.
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో మరిన్ని ఉగ్ర దాడులు జరగవచ్చని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చిన దరిమిలా కశ్మీరు వ్యాప్తంగా ఉన్న 87 పర్యాటక ప్రదేశాలలో 48 ప్రదేశాలను జమ్ము కశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్లో ఉన్న కొన్ని స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయని, ఉగ్ర చర్యలకు పాల్పడాలని వాటికి ఆదేశాలు జారీ అయ్యాయని నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నెల 22న పహల్గాంలో ప ర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో రానున్న రోజుల్లో భద్రతా దళాలు, స్థానికేతరులే లక్ష్యంగా మరిన్ని దాడులు జరపాలని ఉగ్ర గ్రూపులు చురుకుగా పథక రచన చేస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.