Jairam Ramesh | న్యూఢిల్లీ : ప్రధాని మోదీ తాజాగా పాడ్కాస్ట్ ఇంటర్యూలో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశమయ్యాయి. జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ..తానూ మనిషినే, మానవులంతా చేసినట్టుగా, తాను కూడా తప్పులు చేశానని, తానేమీ భగవంతుడ్ని కాదు కదా! అని అన్నారు. ప్రధాని ఇంటర్వ్యూపై శనివారం కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మాటలు ఉన్నాయని జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇదే వ్యక్తి (ప్రధాని మోదీ) 8 నెలల క్రితం తనను తాను దేవుడి ప్రతినిధిగా చెప్పుకున్నారు. తాను మానవుడిగా పుట్టినప్పటికీ, దేవుడి దూతగా ప్రకటించుకున్నారు. తనకు మానవ జన్మ నుంచి కాదు, దేవుడి నుంచి శక్తి వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగారు. అందులో భాగంగానే తానూ అందరిలాంటి మనిషినేనని వివరణ ఇచ్చుకున్నారు’ అని జైరామ్ రమేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘నేను భగవంతుడినేమీ కాదు.. మానవ మాత్రుడినే. నేను జీవితంలో దుర్దుదేశంతో తప్పులు చేయలేదు. అయితే పొరపాట్లు చేసుండొచ్చు’ అని మోదీ ఇటీవల అన్నారు.