న్యూఢిల్లీ, మార్చి 4: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) స్కీమ్ కింద ఇస్తున్న ఆహార ధాన్యాలను ప్రధాని మోదీ ఫొటోతో కూడిన ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.15 కోట్ల మేర ఖర్చు చేస్తున్నదని ది హిందూ నివేదించింది.
ఆర్టీఐ కార్యకర్త అజయ్ బోసు దరఖాస్తులకు అందిన సమాధానాల ప్రకారం.. ప్రధాని మోదీ ఫొటో లోగోతో కూడిన లాయమినేటెడ్ బ్యాగుల కొనుగోలు కోసం రాజస్థాన్, సిక్కిం, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రాంతీయ కార్యాలయాలు టెండర్లను ఖరారు చేశాయి. అదేవిధంగా పశ్చిమబెంగాల్ రీజియన్‌కు సంబంధించి బ్యాగుల కొనుగోలు కోసం కంపెనీ ఎంపిక ప్రక్రియ జరుగుతున్నదని ఆర్టీఐ సమాధానం ద్వారా తెలిసిందని హిందూ కథనం పేర్కొన్నది.
ఆర్టీఐ సమాధానాల ప్రకారం.. 1.07 కోట్ల సింథటిక్ బ్యాగుల కోసం రాజస్థాన్ ఎఫ్‌సీఐ కార్యాలయం రూ.13.29 కోట్లు ఖర్చు చేస్తున్నది. 5.98 లక్షల మోదీ బ్రాండెడ్ బ్యాగుల కోసం త్రిపురలో రూ.85.51 లక్షలు, 4.22 లక్షల బ్యాగుల కోసం మేఘాలయలో రూ.52.75 లక్షలు, మిజోరంలో 1.75 లక్షల బ్యాగుల కోసం రూ.25 లక్షలు ఆయా రాష్ర్టాల్లోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఖర్చు చేస్తున్నాయి. సిక్కింలో ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నది.
దాదాపు 98 వేల బ్యాగులను కొనుగోలు చేసేందుకు ఈ ఈశాన్య రాష్ట్రంలో బ్యాగుకు రూ.14.65 చొప్పున రూ.14.35 లక్షలు వ్యయం చేయనున్నట్టు ది హిందూ తెలిపింది. బ్యాగు చొప్పున ధర ఈ ఐదు రాష్ర్టాల్లో వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఆహార ధాన్యాల పంపిణీ కోసం మోదీ లోగోతో కూడిన నేసిన లామినేటెడ్ బ్యాగుల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఎఫ్‌సీఐ తన అన్ని 26 రీజనల్ కార్యాలయాలను ఆదేశించిందని ది హిందూ అంతకుముందు కథనంలో పేర్కొన్నది.