Rahul Gadhi : బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar assembly elections) నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కూటముల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు పోటాపోటీగా దూషణలకు దిగుతున్నారు. తాజాగా దర్భంగా (Darbhanga) లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో లబ్దిపొందడానికి ఏదో ఒక డ్రామా ఆడుతారని రాహుల్‌గాంధీ విమర్శించారు. చట్ పూజ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ యమునా నదిలో స్నానం చేస్తానని చెప్పారని, అయితే నదిలో కాకుండా నది పక్కన ఒక కుంటను తవ్వించి, అందులో పైప్ ద్వారా స్వచ్ఛమైన నీళ్లను నింపించి స్నానం చేశారని తెలిపారు. ఈ చర్య ద్వారా యమునా నదిలో మురుగు నీరు ప్రవహిస్తుందనే నిజాన్ని దేశానికి తెలియజెప్పారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కోసం ప్రధాని ఈ డ్రామా ఆడారని, అయితే కుంటలోకి స్వచ్ఛమైన నీళ్లను వదిలేందుకు ఏర్పాటు చేసిన పైపు ఫొటో బయటపడటంతో ఆ డ్రామా బెడిసికొట్టిందని రాహుల్ చెప్పారు. తర్వాత జరిగే ప్రధాని ప్రచార సభలో ఓ 200 మంది లేచి ఓట్ల కోసం డ్యాన్స్ చేయాలని ప్రధానిని కోరితే వెంటనే డ్యాన్స్ మొదలవుతుందని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఏకంగా భరతనాట్యమే చేస్తారని ఆయన విమర్శించారు.