ఆమోదించిన బ్రిక్స్ దేశాధినేతలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని, మానవ హక్కులను పరిరక్షించాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ‘న్యూఢిల్లీ తీర్మానాన్ని’ ఆమోదించాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదుల స్థావరంగా అఫ్గాన్ మారకుండా చర్యలు తీసుకోవడం, అఫ్గాన్ కేంద్రంగా ఇతర దేశాలపై ఉగ్రదాడులు జరుగకుండా చూడటం, సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలపై నిఘా, ముష్కరులకు ఆర్థికసాయం అందే మార్గాలను కట్టడి చేయడం వంటి పలు కీలకాంశాలు ఈ తీర్మానంలో ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం (బ్రిక్స్) 13వ సదస్సు గురువారం వర్చువల్గా జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా పాల్గొన్నారు. కాబూల్ ఎయిర్పోర్ట్పై ఇటీవల జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ నేతలు ఖండించారు.