Vande Bharat | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. రేపటి నుంచి మరో నాలుగు రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని శుక్రవారం వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 8.15 గంటలకు నాలుగు వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టవిటీని ఈ రైళ్లు పెంచుతాయని రైల్వేశాఖ తెలిపింది. గోరఖ్‌పూర్‌లోని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యాన్ని పెంచుతాయన్నారు.
బనారస్–ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారత్ రైలు.. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే సుమారు 2.40 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు మతపరమైన, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
లక్నో–సహరాన్పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ప్రయాణ సమయాన్ని దాదాపు గంట పాటు తగ్గిస్తుంది. ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహరన్పూర్ ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫిరోజ్‌పూర్ నుంచి ఢిల్లీకి వందే భారత్ కేవలం 6.40 గంటల్లోనే చేరుకుంటుంది. బటిండా, పాటియాలా మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఈ రైలు వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలను పెంచుతుందని, సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. జాతీయ మార్కెట్లతో మెరుగైన అనుసంధానాన్ని సులభతరం చేస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
దక్షిణ భారతదేశంలో ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకుపైగా తగ్గించనున్నది. ప్రయాణాన్ని 8 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను కలుపనున్నది. నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకం, ప్రాతీయ సహకారం, అభివృద్ధిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్ర, శనివారాల్లో వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలోనే నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. ప్రధాని బనారస్ రైల్వే స్టేషన్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శుక్రవారం సాయంత్రం మోదీ ప్రత్యేక విమానంలో బాబత్పూర్లోని లాల్ బహదూర్‌శాస్త్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ స్వాగతం పలుకుతారు. ఈ పర్యనలో ఆయన విద్యావేత్తలు, సామాజిక, వివిధ రంగాలకు చెందిన నిపుణులు సహా 3200 మందితో సంభాషిస్తారు.