న్యూఢిల్లీ: రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో యూకే వెళ్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. అదేవిధంగా రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకునేందుకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో చర్చలు జరుపనున్నారు.
మూడేండ్ల చర్చల ఫలితంగా గత మే నెలలో భారత్-యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. దీనిద్వారా యూకేలో భారతీయ వస్తుసేవలకు మార్కెట్ పెరగనుంది. అలాగే ఇండియాలో బ్రిటిష్ కంపెనీల ఉత్పత్తులు, సేవల లభ్యత అధికం కానుంది. ఎఫ్టీఏ వల్ల రెండు దేశాల్లో ఉద్యోగాలు, అభివృద్ధి రేటు, ఎగుమతులు పెరుగుతాయి. ఈ ఒప్పందంతో భారత్ నుంచి యూకేకు ఎగుమతి అయ్యే వివిధ రకాల సరకుల్లో 99శాతం వాటిపై సుంకాలు (టారిఫ్లు) రద్దవుతాయి. ఇక యూకే నుంచి భారత్ దిగుమతి చేసుకునే విస్కీ, కార్ట వంటి 90 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గనున్నాయి.
యూకే పర్యటన అనంతరం ప్రధాని మోదీ మాల్దీవులకు చేరుకోనున్నారు. జూలై 25-26 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్ పట్ల అనుసరించిన వ్యతిరేక వైఖరి కారణంగా గతేడాది ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత టర్కీ, చైనాల్లో పర్యటించారు. ఆ తర్వాత భారత్ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠంభన తర్వాత ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే మొదటిసారి.