PM Modi : ఇరాన్ యుద్ధం, సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో శుక్రవారం మోదీ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచంతోపాటు ఇండియాను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.
దేశంలో చమురు కొరత సహా అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై మోదీ చర్చిస్తారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, తగిన ప్రణాళికలు రూపొందించడం, సరఫరా మార్గాలు, చమురు భద్రత, విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. రాష్ట్రాలు, కేంద్రం సమన్వయం, పరస్పర సహకారంతో టీమ్ ఇండియాగా, ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్తితుల్ని ఎదుర్కోవడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక స్థిరత్వం సాధించడంపై సమావేశం ఉంటుంది.
అయితే, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లు ప్రత్యేకంగా సమావేశమవుతారు. కేంద్రం తీసుకోబోయే చర్యలను అధికారులకు వివరిస్తారు. దేశంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.