న్యూఢిల్లీ, అక్టోబర్ 16: పెద్దనోట్ల రద్దు లాంటి అనోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన భారతావని ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ‘గొప్ప ముందడుగు’ వేసిందట! కేవలం ఎనిమిదేండ్ల పాలనలోనే దేశాన్ని ‘ఆకలి రాజ్యం’గా మార్చిన ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం 75 జిల్లాల్లో వేర్వేరు బ్యాంకులకు చెందిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డీబీయూ)లను ప్రారంభిస్తూ ఈ విషయాన్ని సెలవిచ్చారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. డిజిటల్ రంగంలో నేడు దేశం మరో మైలురాయిని అధిగమించిందని, ఈ విజయానికి సమష్టిగా కృషిచేసిన దేశ ప్రజలను అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. డిజిటల్ సేవలను బలోపేతం చేయడంతోపాటు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో దేశానికి పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను అందించేందుకు డీబీయూలు తోడ్పడతాయని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను కేంద్రం ఏర్పాటు చేసింది.
డీబీయూలు అంటే..
ఖాతాదారులకు పేపర్‌లెస్ పద్ధతిలో సురక్షితంగా, సమర్థంగా డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందజేయడంతోపాటు ఇప్పటికే ఉన్న ఆర్థిక ఉత్పత్తులు, సేవలను డిజిటల్ మాధ్యమాల ద్వారా అందించేందుకు కనీస డిజిటల్ మౌలిక వసతులతో ప్రత్యేకంగా ఏర్పాటైన కేంద్రాలనే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటారు. కాగితాలను వినియోగించకుండా పొదుపు ఖాతాలను తెరవడం, బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం, పాస్‌బుక్ ప్రింటింగ్, నిధుల బదిలీ, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం, రుణాలకు దరఖాస్తు చేసుకోవడం, చెల్లింపుల నిలిపివేత, క్రెడిట్/డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం, అకౌంట్ స్టేట్మెంట్లను చూసుకోవడం లాంటి సదుపాయాలను డీబీయూలు కల్పిస్తాయి. వాస్తవానికి ఈ సేవలన్నీ ఇప్పటికే అన్ని బ్యాంకుల శాఖల్లో అందుబాటులో ఉన్నాయి. డీబీయూల ఏర్పాటుతో ఖాతాదారులకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. అయినా డీబీయూలతో దేశం డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో గొప్ప ముందడుగు వేసిందని మోదీ జబ్బలు చరుచుకోవడం గమనార్హం.