న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కాన్వాయ్‌ని(PM Modi security lapse) పంజాబ్‌లో అడ్డుకున్న విషయం తెలిసిందే. 2022 జనవరి 5వ తేదీన జరిగిన ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఏర్పడిన ఇందూ మల్హోత్రా కమిటీ సాక్ష్యుల వాంగ్మూలాలను సేకరించింది. అయితే ఆ కమిటీ ముందు చెప్పిన సాక్షుల వాంగ్మూలాలను తమకు ఇవ్వాలని పంజాబ్ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా విచారణ చేపట్టి సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ రాష్ట్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. భద్రతా వైఫలంపై విచారణ చేపట్టేందుకు 2022 జనవరి 12వ తేదీన మాజీ జడ్జి ఇందూ మల్హోత్రా నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు ఆ రిపోర్టు వివరాలను చెప్పాలని పంజాబ్ ప్రభుత్వం కోరింది. కానీ సుప్రీం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రధాని మోదీ పర్యటన వేళ ఫిరోజ్‌పుర్ ఎస్ఎస్పీ తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించలేదని సుప్రీం నియమిత కమిటీ తన రిపోర్టులో పేర్కొన్నది.