PM Modi | నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో దాదాపు రూ.11వేల కోట్ల విలువైన రెండు కీలకమైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ఢిల్లీ సెక్షన్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 (UER-2) ఉన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ, హర్యానా ముఖ్యమంత్రులు రేఖ గుప్తా, నయాబ్ సింగ్ సైనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ముండ్కాలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీకి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ కనెక్టివిటీ లభించనున్నది. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నుంచి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందనున్నది. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోడ్లు ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు ఎన్సీఆర్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ బీజేపీ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇది మనకే ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని చూపిస్తుందని.. కొందరు దీన్ని తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
వారంతా ప్రజలకు దూరంగా ఉన్నారన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పేరు ద్వారక అని.. ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం రోహిణి అని, జన్మాష్టమి ఆనందం అని, యాదృచ్ఛికంగా ద్వారకాధీశ భూమి నుంచి వచ్చానని మోదీ పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. నేడు దేశ రాజధాని ఢిల్లీ దేశంలో జరుగుతున్న అభివృద్ధి విప్లవాన్ని చూస్తోంది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్‌తో అనుసంధానంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఎన్సీఆర్ ప్రజల సౌకర్యాన్ని పెంచుతుందని.. ప్రతి ఒక్కరి సమయం ఆదా అవుతుందన్నారు. మన వ్యాపారులు, వ్యాపారవేత్తలు, రైతులు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతుందన్నారు. ప్రపంచం భారతదేశాన్ని చూసినప్పుడు.. మూల్యాంకనం చేసిన సమయంలో మొదటి దృష్టి మన రాజధాని ఢిల్లీపై పడుతుందన్నారు. మనం ఢిల్లీని అభివృద్ధి నమూనాగా మార్చాలని పిలుపునిచ్చారు. ఢిల్లీని గొప్ప నగరంగా మార్చడానికి మనం చేపట్టిన పని నిరంతరం కొనసాగుతోందన్నారు.
నేటికీ మనమందరం దీనికి సాక్షులమని.. అది ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ అయినా ఈ రెండు రోడ్లు అద్భుతంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత.. ఇప్పుడు అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ ఢిల్లీకి చాలా సహాయపడుతుందన్నారు. అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్‌కు మరో ప్రత్యేకత ఉందని.. ఇది ఢిల్లీని చెత్త నుంచి విముక్తి చేయడంలో సహాయపడుతుందన్నారు. అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్‌ను తయారు చేయడంలో లక్షల టన్నుల చెత్తను ఉపయోగించారని.. వ్యర్థ పదార్థాలను రోడ్డు తయారీలో ఉపయోగించారన్నారు. రేఖ గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునను శుభ్రపరిచే పనిలో నిరంతరం నిమగ్నమై ఉండడంపై సంతోషంగా ఉన్నానని ప్రధాని మోదీ అన్నారు. ఈ సమయంలో యమునా నది నుంచి 16 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారని.. ఢిల్లీలో చాలా తక్కువ సమయంలో 650 దేవి ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయన్నారు. భవిష్యత్తులో ఈ ఎలక్ట్రిక్ బస్సులు సుమారు 2వేల సంఖ్యను దాటుతాయని.. గ్రీన్ ఢిల్లీ – క్లీన్ ఢిల్లీ మంత్రాన్ని మరింత బలపరుస్తుందన్నారు.
దేశంలోనే మొదటి ఎనిమిది లైన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే అయిన ఈ ప్రాజెక్టు ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. 10.1 కిలోమీటర్ల మార్గాన్ని రూ.5,360 కోట్లతో నిర్మించారు. ఈ మార్గం యశోభూమి, ఢిల్లీ మెట్రో బ్లూ, ఆరెంజ్ లైన్లకు, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్‌కు అనుసంధాస్తింది. గతేడాది మార్చిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని 19 కిలోమీటర్ల హర్యానా విభాగాన్ని ప్రధాని ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ విభాగం సైతం అందుబాటులోకి వచ్చింది. దాంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల్లో చేసే అవకాశం ఉంటుంది. ఇక రూ.5,580 కోట్ల వ్యయంతో నిర్మించిన UER-II ప్రాజెక్టు ఢిల్లీకి మూడో రింగ్ రోడ్‌గా పని చేయనున్నది. ఢిల్లీ, సోనిపట్, బహదూర్గఢ్ వంటి నగరాలను కలుపుతోంది. అలీపూర్ నుంచి డిచాన్ కలాన్ వరకు నిర్మించారు. నిర్మాణానికి ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ నుండి సేకరించిన రెండు మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉపయోగించడం విశేషం.