Turban | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రత్యేక వస్త్ర ధారణతో ఆకట్టుకున్నారు. ఏటా స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించే ప్రధాని.. ఈ సారి కూడా వైవిద్యంగా తయారయ్యారు. ఈ ప్రత్యేక వేడుకల్లో మోదీ డ్రెస్సింగ్ స్టైలే కాదు.. ఆయన ధరించే తలపాగాలు (Turban) ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తుంటాయి. మొదటిసారి ప్రధాని అయినప్పటి నుంచీ మూడో తఫా వరకూ ఏటా ఈ సందర్భాల్లో వేర్వేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ క్రమంలో వైవిధ్య భరితమైన ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు.
గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోదీ తెల్లటి కుర్తా పైజామాతోపాటు లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్ ధరించారు. ముఖ్యంగా ఆయన ఇవాళ రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా (Rajasthani leheriya turban) ధరించారు. నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగులు మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఈ తలపాగాతోనే మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇక గతేడాది (2023) స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను ధరించారు. ఇక అంతక్రితం ఏడాది 2022లో ఎరుపు రంగు నమూనా, కుంకుమ పువ్వు రంగులో ఉన్న పొడవాటి తోక ఉన్న తలపాగాను మోదీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2021లో ‘కోల్హాపురీ ఫెతా’గా పిలిచే పొడవైన కాషాయ రంగు తలపాగా చుట్టుకున్నారు. 2020లో కాషాయం, పసుపు రంగుతో ఉన్న తలపాగా.. కాషాయ అంచు ఉన్న తెల్లటి కండువాను ధరించారు. ఇక 2019 స్వాతంత్య్ర వేడుకల్లో రాజస్థానీ సంప్రదాయ ఇంద్రధనస్సు తలపాగాను అలంకరించుకున్నారు. ఇలా ఏటా ఏదో ఓ ప్రత్యేక తలపాగాతో మోదీ ఆకట్టుకున్నారు.
Also Read..
PM Modi | ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ
PM Modi | మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి : ప్రధాని మోదీ