కాశీ: కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ ఇవాళ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగా నది నుంచి నీటితో ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. నది నుంచి కొంత దూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకూంటూ స్వామివారి సన్నిధికి వెళ్లారు. ఇక ఆలయ పరిసరాల్లో డమరుక స్వాగతం ఆకట్టుకున్నది.
గర్భగుడిలో మోదీ చేత పండితులు అభిషేకం చేయించారు. తొలుత వారు సంకల్పం చదివారు. విఘ్నేశ్వర పూజ.. బిల్వపత్రం సమర్పణ.. పంచామృత పూజ.. వస్త్రం, యజ్క్షోపవీతం సమర్పణ.. నమక.. చమకాలతో విశ్వనాథుడి ఆలయం మంత్రోచ్ఛరణతో ప్రజ్వరిల్లింది.
గంగా జలంతో విశ్వనాధుడికి మోదీ అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించారు. కర్పూర హారం.. కరుణావతారం అంటూ గర్భగుడిలో విశ్వనాథుడిని కీర్తించారు. పూజారులు ప్రధాని మోదీకి ఆశీర్వాదాలు అందించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మోదీ కాశీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.