PM Modi | నవరాత్రి వేడుకల ప్రారంభానికి ముందు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. సోమవారం నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రానున్న నేపథ్యంలో అనేక అంశాలపై స్పందించారు. జీఎస్టీ సంస్కరణలను ఓ వేడుకగా అభివర్ణించారు. ప్రధాని మోదీ స్వదేశీని స్వీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. స్వావలంభన మంత్రంతో ముందుకు సాగాలన్నారు. దేశ ప్రజలకు ఏది అవసరమో.. మనం దేశీయంగా ఏం తయారు చేయగలమో దాన్ని దేశీయంగానే తయారు చేయాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు, నియమాలు, నిబంధనలు, విధానాల సరళీకరణతో మన ఎంఎస్ఎంఈలు, మన చిన్నతరహా, కుటీర పరిశ్రమలు ఎంతో ప్రయోజనం పొందుతాయని ఆయన అన్నారు. అమ్మకాలు సైతం పెరుగుతాయన్నారు. వాటిపై తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని అర్థం అవి సైతం రెట్టింపు ప్రయోజనం పొందుతాయని.. ఈ రోజు అందరి నుంచి నాకు అధిక అంచనాలున్నాయన్నారు.
చిన్న, సూక్ష్మ, కుటీర, ఎంఎస్ఎంఈలు అయినా.. భారతదేశం శ్రేయస్సు శిఖరాగ్రంలో ఉన్నప్పుడు చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవన్నారు. భారతదేశ తయారీ, నాణ్యత ఒకప్పుడు ఉన్నతంగా ఉండేవని.. మనం ఆ వైభవాన్ని తిరిగి పొందాలన్నారు. మన పరిశ్రమలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని.. మనం ఉత్పత్తి చేసేది ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలను అధిగమించాలని మోదీ పిలుపునిచ్చారు. మన ఉత్పత్తులు భారతదేశ, ప్రపంచ ప్రతిష్టను పెంచాలన్నారు. గత 11 సంవత్సరాలలో 250 మిలియన్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని.. ఒక పెద్ద నవ మధ్యతరగతి ఉద్భవించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 1.2 మిలియన్ల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపులు మధ్యతరగతికి గణనీయమైన ఉపశమనాన్ని అందించాయని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు గృహనిర్మాణం, స్కూటర్లు, కార్లు, హోటల్స్ వంటి ఖర్చులను తగ్గిస్తాయన్నారు. పేదలు, నవ-మధ్యతరగతి రెండింతలు ప్రయోజనం పొందుతారని ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పన్నులు, టోల్‌ల సంక్లిష్టతల నుంచి విముక్తి కంపెనీలకు ఒక సవాలుగా ఉందన్నారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులను రవాణా చేయడం చాలా కష్టంగా ఉందని.. కంపెనీలు యూరప్‌కు రవాణా చేయడానికి ఇష్టపడతాయన్నారు. కొత్త సంస్కరణలు వ్యాపారాన్ని సులభతరం చేస్తాయని, వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. దేశ వృద్ధి కథను వేగవంతం చేయడం, తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు దేశ వృద్ధి కథకు కొత్త దిశను ఇస్తాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమానంగా కలుపుతాయని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. 2017లో జీఎస్టీ అమలు ఒక చారిత్రాత్మక అడుగు అని, ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధాని తెలిపారు. ఇది నవరాత్రితో ప్రారంభమవుతుందన్నారు. సెప్టెంబర్ 22న ఉదయం, నవరాత్రి వేడుకల తొలిరోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా జీఎస్టీ పొదుపు పండుగ ప్రారంభానికి గుర్తుగా ఉంటుందని.. పేదలు, మధ్యతరగతి, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యవస్థాపకులు అందరూ ఈ సంస్కరణల ద్వారా ప్రయోజనం పొందుతారని, పండుగ కాలం ఆనందంతో నిండి ఉంటుందని ప్రధాని చెప్పుకొచ్చారు.